calender_icon.png 23 October, 2024 | 9:55 AM

అనుమతి లేకున్నా ఫంక్షన్‌హాల్ నిర్మాణం

12-09-2024 02:05:38 AM

  1. ప్రభుత్వ భూమి కబ్జా చేసి రోడ్డు 
  2. పాల్వంచ మున్సిపాలిటీలో కనిపించని రికార్డులు 
  3. తమ పరిధి కాదంటున్న కమిషనర్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అక్రమంగా ఓ వ్యక్తి ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సదరు వ్యక్తి 2019 సంవత్సరంలో ఇంటి నిర్మాణం కోసం, ఫంక్షన్‌హాల్ కోసం వేర్వేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. మున్సిపల్ అధికారులు ఆన్‌లైన్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించకుండా, క్షేత్రస్థాయికి వెళ్లకుండా రెండు ఇంటి నెంబర్లు కేటాయించారు. ఫంక్షన్‌హాల్ కోసం చేసుకున్న ఆన్‌లైన్ దరఖాస్తులో బిల్డింగ్‌కు అనుమతిలేదు.

దరఖాస్తుదారుడి ఆధార్, పాన్‌కార్డు నెంబర్లు కూడా నమోదు చేయలేదు. ఎస్సెస్‌మెంట్ కూడా లేదు. అయినా మున్సిపల్ ఆర్వో విభాగం ఇంటి నెంబర్లు కేటాయించడం గమనార్హం. ఎలాంటి అనుమతి లేకున్నా గిరిజన చట్టాలను తుంగలో తొక్కి ఏజెన్సీ ప్రాంతంలో హైఫై ఫంక్షన్‌హాల్ నిర్మాణం దర్జాగా చేపట్టారు. అంతటితో ఆగకుండా ఫంక్షన్‌హాల్‌కు ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. ఆ స్థలం గతంలో అక్రమార్కుల నుంచి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించనది కావడం గమనార్హం.

ఇంత జరుగుతున్నా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ డాకు నాయక్‌ను వివరణ కోరగా.. ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేసిన ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలోనే లేదన్నారు. ఇంటి నంబర్లు ఎలా కేటాయించారో విచారణ చేపడుతామని చెప్పారు. కాగా సదరు వ్యక్తి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి తన వెనుక ఉన్నారని చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిసింది.