13-04-2025 12:00:00 AM
-రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
ముషీరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ చేయడమంటే ముస్లింల హక్కుల కాలరాడమే కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న రాజ్యంగానికి తూట్లు పొడవడమేనని పలువురు వక్తలు అగ్రహాం వ్యక్తంచేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం-24ను నిరసిస్తూ అమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికీ పూర్తిగా విరుద్దమన్నారు.
ఎం.ఆర్.జి వినోద్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. బిజెపి చట్ట సవరణ చేసిందని తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, సవరణ చట్టం ద్వారా దేశ సమగ్రతకు భంగం వాట్లిలే విధంగా ఉండడంతో దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ చట్ట సవరణ పేరుతో అందులో కేంద్ర తల దూర్చడం సరైంది కాదన్నారు. అబ్బాస్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని సిపిఐ(ఎం)పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
జాప్రీ మాట్లాడుతూ కేంద్ర తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం ద్వారా పట్టణ ప్రాంతాల్లో విలువైన భూములను కొట్టేసేందుకు కుట్రలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిజెపి రహిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వక్ఫ్ చట్టాన్ని అమలు చేయరాదని కోరారు. ఈ టిజెఎసి నగర ఉపాధ్యక్షులు అప్జల్, ఆప్ నేతలు సుధారాణి, విజయ్ మల్లంగి, జావిద్ షరీఫ్, షాబాజ్, నాగరాజు, అజీమ్ బేగ్, అజ్మత్, ఖాన్ తదితరులు పాల్గొన్నారు.