హైదరాబాద్: కూకట్ పల్లి జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. విద్య వల్ల ఇబ్బందులు అధిగమించవచ్చని అంబేద్కర్ నమ్మారని అందుకే అనేక విశ్వవిద్యాలయాలను స్థాపించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సమసమాజ స్థాపనకు యువత మేధస్సు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని తెలిపారు. రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. సంవిధాన్ సమ్మాన్ బచావ్ సమ్మేళన్ కార్యక్రమం చేపడుతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
సమాజ పరివర్తన, సమస్యలకు పరిష్కారం చూసేది రాజ్యాంగం అన్నారు. మనంమదరం రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భారత్ లో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచాన్ని జయించే శక్తి, మేధస్సు భారత్ లో ఉందని విక్రమార్క వెల్లడించారు. జాతుల మధ్య పోరాటాలతోనే శక్తి మొత్తం నిర్వీర్యమవుతోందన్నారు. అసమానతలు లేకుండా ఉంటే భారత్ ప్రపంచాన్ని జయించి ఉండేదని ఆయన తెలిపారు. అసమానతలు అధిగమించే అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అణగారిన వర్గాల కోసమే అంబేద్కర్ పనిచేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ పనిచేశారని వివరించారు. ప్రతి పౌరుడు సమానంగా ఓటు హక్కు పొందగలుగుతున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.