calender_icon.png 13 November, 2024 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ

10-11-2024 01:31:36 AM

  1. టార్గెట్లు విధించి మరీ చోరీలు
  2. ఉద్యోగం పోయిన అనంతరం ముఠా నాయకుడిగా చెలామణి
  3. హత్య చేసేందుకు కారుతో గుద్దిన ప్రత్యర్థులు.. చికిత్సపొందుతూ మృతి 

ఎల్బీనగర్, నవంబర్ 9: చెడు వ్యక్తులతో స్నేహం చివరకు హాని కలిగించేవరకు వదలదు అనేది కూడా అంతే నిజం. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అతడొక బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేసేవాడు. అయితే, అదే సమయంలో దొంగలతో దోస్తానా పెరిగింది.

వారి ఆదాయం.. ఆర్భాటం చూసి తాను కూడా భారీగా సంపాదించాలని అనుకున్నా డు. అయితే అతడి అత్యాశ అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మేకల ఈశ్వర్ ఉమ్మడి రాష్ట్రంలో 2010లో పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా చేరాడు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట పోలీస్ స్టేషన్లతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశాడు.

పోలీస్ శాఖలో పనిచేస్తుం డటంతో దొంగలతో సాన్నిహిత్యం పెంచుకొని.. దొంగలు దోచిన సొత్తు ను బెదిరించి తీసుకునేవాడు. అలాగే సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్నవారిని బెదిరించి.. వారి దగ్గర ఉన్న ఫోన్లు తీసుకుని తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. చిన్నగా మొదలైన ఈశ్వర్ నేర చరిత్ర క్రమంగా మరింత విస్తరించింది. చోరీ ఫోన్లతో మొదటు పెట్టి.. చైన్‌స్నాచర్ల వరకు వెళ్లాడు.

ఇలా తన పరిధిలో దొంగలతో కలిసి దోచిన సొత్తును సొమ్మ చేసుకునేవాడు. ఈ క్రమంలో దొంగలను చేరదీయ డంతో పాటు వారికి ఆశ్రయం కల్పించి.. వారికి టార్గెట్లు ఇచ్చి మరీ చోరీలు చేయించేవాడు. అయితే చోరీ కేసులను దర్యాప్తు చేస్తున్న క్రమంలో 2022లో నల్లగొండ పోలీసులకు మొదటిసారిగా ఈశ్వర్ నేరచరిత్ర గురించి తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు ఈశ్వర్‌ను ఉద్యోగం తీసేశారు.

దొంగల ముఠాకు నాయకుడిగా ఎదిగి

తదనంతరం దొంగల ముఠాకు ఈశ్వర్ నాయకుడిగా ఎదిగాడు. దీంతో ఇతర ముఠాల నాయకులు ఈశ్వర్‌పై కక్షకట్టారు. సెల్‌ఫోన్లు, చైన్‌స్నాచర్ల ముఠా నాయకులు సెటిల్మెంట్ చేసుకుందామని ఈశ్వర్ కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ల 2న సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తాలో అందరూ కలుసుకున్నారు.

పక్కనే ఉన్న వైన్స్‌లో మద్యం సేవించగా..మాటల యుద్ధం జరగడంతో బయటకు వచ్చారు. మందమల్లమ్మ చౌరస్తాలో మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు ఈశ్వర్‌ను కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్‌ను పోలీసులు స్థానికంగా ఉన్న ఆసుప త్రికి తరలించారు.

ఆసుపత్రిలో గత ఐదురోజులుగా చికిత్స పొందుతున్న ఈశ్వర్ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈశ్వర్‌పై దాడికి పాల్పడిన నలుగురిలో ముగ్గురు పరారీలో ఉండగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.