calender_icon.png 29 September, 2024 | 11:57 AM

సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

29-09-2024 01:57:48 AM

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఓ ఆర్‌ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకు న్నది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ గౌడ్ (28) కొన్నేళ్ల క్రితం కానిస్టేబుల్ కొలువు సాధించాడు.

కొద్దిరోజులుగా ఆయన రంగారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రోజూలాగానే విధులకు హాజరైన బాలకృష్ణ మధ్యాహ్నం బాత్రూం గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు. అనంతరం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ సమయంలో కార్యాలయంలో ముగ్గురు సహ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సూసైడ్ లెటర్‌లో అంశాలు ఇవీ.. 

‘అమ్మా నాన్న, నేను చేస్తున్నది తప్పే. నాకు బతకాలని లేదు. రోజువారీ జీవితం నాకు నరకంగా ఉంది. నేను ఎంత కంట్రోల్ అవుదామనుకున్నా అవుతలేదు. జీవితంలో ఏదో కోల్పోయాననే బాధ నన్ను వేధిస్తున్నది. నేను జీవితంలో మిమ్మల్ని కూడా సంతోషంగా చూసుకోలేనని అనుకుంటున్నా.

నాపై లేనిపోని నిందలు ఉన్నాయి. ఆ నిందలను భరించలేకపోతున్నా. నా చావుకు నేనే కారణం. నా చావుకు ఆర్థిక సమస్యలు లేదా ప్రేమ కారణం కాదు. దయచేసి నేను చనిపోయిన తరువాత నాపై నిందలు ఆపండి. నేను ఒక ముగ్గురికి డబ్బులు ఇవ్వాలి. వాళ్లకు ఆ డబ్బు ఇవ్వండి’ అని ఘటనా స్థలంలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్‌లో ఉన్నది.