ఫోన్ ట్యాపింగ్ కేసు
- శ్రవణ్‌కుమార్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పీపీ వాదన
- తీర్పు వాయిదావేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కుట్రలో కీలకపాత్ర పోషించిన ఐన్యూస్ ఛానల్ ఎండీ, ఏ శ్రవణ్‌కుమార్ రావును కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) గురువారం హైకోర్టుకు చెప్పారు.
ప్రైవేటు వ్యక్తిగా ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లి.. కొందరు వ్యక్తులతోపాటు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేయించి సమాచారాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలకు అందజేశారని చెప్పారు. నాటి మంత్రి టీ హరీశ్‌రావు ప్రోత్సాహంతోనే శ్రవణ్‌కుమార్ ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లగలిగారని, అక్కడి అధికారులతో కుమ్మక్కై పలువురి ఫోన్లను ట్యాప్ చేయించారని చెప్పారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడైన శ్రవణ్‌కుమార్ రావు తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ దాఖలుచేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ జీ రాధారాణి విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఎస్‌ఐబీ ఆఫీసులోకి సాధారణ పోలీసులు కూడా వెళ్లలేరని, అలాంటిది ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్లారంటేనే ఆయన పలుకుబడి అర్థం చేసుకోవచ్చన్నారు.
అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతోనే అధికారులు శ్రవణ్‌కుమార్‌కు అనుమతి ఇచ్చారన్నారు. డబ్బు తరలింపులు జరుగుతున్న సమాచారాన్ని ఫోన్‌ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే వారని వివరించారు. ప్రణీత్‌రావును అరెస్ట్ చేసిన వెంటనే శ్రవణ్‌కుమార్ రావు విదేశాలకు పరారయ్యారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిన వెంటనే ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారన్నారు. అనంతరం శ్రవణ్‌కుమార్ కూడా తిరుపతి, చెన్నై, ఇంగ్లండ్ అక్కడి నుంచి అమెరికా వెళ్లిపోయారన్నారు. కుట్రలో భాగస్వామి కానట్లయితే ఎందుకు పారిపోవాల్సి వచ్చిందన్నారు.
ఇప్పటికే కింది కోర్టు 69 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారన్నారు. ఈ దశలో ముందస్తు బెయిలు మంజూరు చేయరాదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ సందర్భంగా 440 పేజీల కౌంటర్ అఫిడవిట్‌ను పీపీ న్యాయమూర్తికి అందజేశారు. ఈ వాదనలను పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వ్యతిరేకించారు.
ఫోన్ ట్యాపింగ్ కుట్రతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. ఒక జర్నలిస్టుగా రాజకీయాలను విశ్లేషిస్తుంటారన్నారు. కేసు నుంచి పారిపోయారనడంలో వాస్తవంలేదని, ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారన్నారు. దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడానికి ఆయన క్రిమినల్ కాదన్నారు.
పిటిషనర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని అందువల్ల పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏవీ శ్రవణ్ కుమార్‌కు వర్తించవన్నారు. విచారణకు శ్రవణ్‌కుమార్ అందుబాటులో ఉన్నారంటూ ఆయన ఫోన్ నెంబరు, ఈమెయిల్, చిరునామా వివరాలను వెల్లడించారు.
ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ నిందితుడికి బెయిలు మంజూరుచేసి కోర్టులో లొంగిపోవాలని ఆదేశిస్తామని, అలా లొంగిపోతే న్యాయవాది సమక్షంలో విచారణ చేపడతారా అంటూ పీపీని అడిగారు. దీనిపై దర్యాప్తు బృందం నుంచి వివరణ తీసుకుని శుక్రవారం తెలియజేస్తానంటూ పీపీ తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు.
4 వరకు భుజంగరావు మధ్యంతర బెయిలు పొడిగింపు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావు మధ్యంతర బెయిల్‌ను డిసెంబరు 4 వరకు పొడిగిస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మేకల తిరుపతన్న బెయిలు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని పిటిషినర్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో భుజంగరావు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.