20-03-2025 12:10:28 AM
వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీని నిర్బంధ క్యాంపుగా మార్చే కుట్రలో భాగంగానే ఓయూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బుధవారం ఆర్ట్స్ కాలేజీ మెయిన్‌రోడ్‌పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓయూ అధికారుల సర్క్యులర్‌పై ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఒకవైపు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారెంటీ అంటూనే ఓయూలో ఇంత నియంతృత్వంగా అప్రజాస్వామీకంగా సర్కులర్ ఇచ్చినా స్పందించడంలేదన్నారు. యూనివర్సిటీలలో నిధులు, నియామకాలు లేక యూనివర్సిటీలు సమస్యల నిలయాలుగా మారిన తరుణంలో విద్యార్థుల అసహనాన్ని అణచివేసేందుకు ఈ సర్కులర్ జారీ చేశారని చెప్పారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ, విద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులో అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఓయూ బంద్ పిలుపునిస్తున్నట్లు తెలిపారు.