ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): విశాఖ ఉక్కును మూసివేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అమ్మపెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా కేంద్రం తీరు ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రూ.6 వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ఇక ముడి పదార్ధాలు నిండుకున్నాయన్నారు. కొనేందుకు చిల్లిగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమే అంటూ యాజమాన్యం చేతులెత్తేస్తుంటే ప్రధాని మోదీకి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
అప్పు తేవడానికి గ్యారెంటీ కూడా కనికరం లేదని, ఏపీ ఎంపీల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కిన మోదీ, ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ అడుతున్నారని, లేదు అంటునే దోషులకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో అదానీ, అంబానీ, జిందాల్ వంటి వ్యాపారుల చేతిలో పెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. ఏపీ బీజేపీ నేతలు, కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ, జనసేన పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.