17-03-2025 01:37:30 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ సర్కారు కలిసి తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
ఈ విషయంలో బీఆర్‌ఎస్ చెప్పిందే నిజమవుతోందన్నారు. ఆదివారం కేటీఆర్ ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సింగరేణి ఉద్యమానికి ఊపిరిలూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామన్నారు.
ఓయూలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కేటీఆర్ ఖండిస్తూ ఆదివారం ట్వీట్ చేశారు. విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య పాలనను ఏడో గ్యారెంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే ఆ హామీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కును రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదంటూ అల్టిమేటం జారీ చేయడం అనేది ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థుల పట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదన్నారు.