ముషీరాబాద్, నవంబర్ 29: ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ‘ఫీజుల పోరు’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు విద్యార్థులు మరో ఉద్యమం చేయక తప్పదని పేర్కొన్నారు. అప్పులు తీసుకొచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.