calender_icon.png 20 September, 2024 | 2:47 AM

రాహుల్ హత్యకు కుట్ర!

19-09-2024 03:30:41 AM

ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఢిల్లీ, సెప్టెంబర్ 18: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ హత్య కు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులపై కంప్లుంట్ చేశారు. రాహుల్ భద్రతకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ప్రతిని  ఈసీకి ఆ పార్టీ లీడర్ అజయ్ మాకెన్ పంపారు. “రాహుల్‌ను టెర్రరిస్ట్ అంటూ ఆయనపై దాడి చేస్తామని ఎన్డీఏ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై రాహుల్  ఒత్తడి తేవడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలకు నచ్చడం లేదు. అందుకే వారు రాహుల్‌ను చంపుతామని బెదిరిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ నేత తర్వీందర్‌సింగ్, కేంద్రమంత్రి రవ్‌నీత్,శివసేన ఎమ్మెల్యే సంజయ్ పేర్లను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ నాలుకను ఎవరైనా కోస్తే వారికి రూ.11 లక్షల రివార్డును ఇస్తానంటూ సంజయ్ ప్రకటించారు.   

 బీజేపీ ఆఫీస్ ముట్టడి..

 రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్ అని,ఆయనకు ఇందిరాగాంధీకి పట్టినే గతే పడుతుందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమన్నది. ఏఐసీసీ పిలుపుతో దేశవ్యాప్తంగా పార్టీ నిరసనలు చేపట్టింది. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసును కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.