కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
హైదరాబాద్, మే 11( విజయక్రాంతి) ః దేశం నుంచి ముస్లింలను తరిమేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని, మాజీ ఎంపీ హన్మంతరావు ఆరోపించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ,అమిత్‌షా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ యువతను మోసం చేశారని, అందుకే దేశ ప్రజలంతా “మోదీ హటావో.. దేశ్ బచావో” అని నినాదం ఎత్తుకున్నారని పేర్కొన్నారు. ఈ సారి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
బీసీని అని చెప్పుకునే మోదీ కులగణనను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ మీటింగ్‌లకు ప్రజలు టికెట్లు కొనుక్కొని మరీ వస్తున్నారని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అదాని, అంబానీలకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ.. పేదలకు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతులకు రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని, ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నా జీవితం ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. పార్టీ కోసమే పని చేస్తా అని హన్మంతరావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ లక్ష మెజార్టీతో గెలుస్తాడని జోస్యం చెప్పారు.