గాంధీపై కేటీఆర్ ఆరోపణలు కుట్రలో భాగమే
నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టిన
మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో రాష్ర్టంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో, ప్రభుత్వ దవాఖానలను ఎలా దెబ్బతీశారో జనం మర్చిపోలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖానలను పదేళ్ల పాటు నాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
గాంధీ దవాఖానకు అత్యంత విషమంగా ఉన్న రోగులు వస్తారని, చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించేందుకు డాక్టర్లు తమ శక్తిమేర ప్రయత్నిస్తారని అన్నారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఆయన అజ్ఞానానికి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే ఆయన సహజ గుణానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయన్నారు.
గాంధీని నాశనం చేసి రోగులను రానివ్వకుండా చేసి కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లుతు న్నారని అన్నారు. ఇకనైనా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయ డం మానుకోకపోతే, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
గాంధీ దవాఖానకు వచ్చేది దొర జనం కాదు, మా పేదలని, తాను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టినట్లు మంత్రి తెలిపారు. పేద రోగుల బాగోగులు చూసుకోవడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కుట్రలను నమ్మి గాంధీకి వచ్చే రోగులు భయప డవద్దని అన్నారు. ధైర్యంగా వచ్చి చికిత్స చేయించుకోవాలని మంత్రి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిన ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాడిన పెడుతున్నామని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన భరోసా కల్పించారు.