కేంద్ర ప్రభుత్వానికి ప్రజాసంఘాల హితవు...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేరళ వామపక్ష ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ఇకనైనా మానుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు హితవు పలికారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం లంక రాఘవులు మాట్లాడారు, కేరళ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు 57,400 కోట్ల రూపాయలను ఇవ్వకపోగా రుణం తీసుకునే అవకాశాలను సైతం అడ్డుకుంటూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. మరోవైపు కరోనా సమయంలోను, ప్రకృతి విపత్తులు సంభవించిన ఆర్థిక సహాయాన్ని ప్రకటించలేదన్నారు. కేరళ ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న అన్నమొల్ల కిరణ్, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, నాయకులు సురేందర్, మంజుల, పోచన్న, రవీందర్ పాల్గొన్నారు.