25-02-2025 01:37:29 AM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లేడు
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎవరికి ఓటేస్తారు..!
అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం కడుతారని ధీమా
మంచిర్యాల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి
మంచిర్యాల, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : బీఆర్ ఎస్ పార్టీకి ఎంఎల్ సీ ఎన్నికలలో అభ్యర్థి లేరని, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే బీజేపీతో దోస్తానా చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ వారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో డీసీసీ అధ్యక్షతన కొక్కిరాల ప్రేం సాగర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం మాట్లాడారు.
ప్రధాన ప్రతి పక్ష పార్టీగా ఉన్న బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులు ఏ పార్టీకి ఓటు వేస్తారని, ఎవరికి మద్ధతు ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లలో సైతం బీఆర్‌ఎస్ ఓడిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎలా గెలిచారో ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్ జిల్లా లక్షల ఎకరాలను సస్యశ్యామలం అయ్యేటివన్నారు.
రాష్ర్టంలో అధికారం చేపట్టి పది నెలల్లోనే 55,163 ఉద్యోగాలు వివిధ శాఖల్లో కల్పించామని, పట్టభద్రులకు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం పని చేస్తుందని, త్వరలోనే కొత్త కంపనీలు తీసుకువచ్చి పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి నాణ్యత ప్రమాణాలు పెంపొందిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ 2014, 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
ఈ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలుతెలంగాణ రాష్ట్రానికి బకాయి ఉన్నారన్నారు. కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ఉద్యోగం ఇచ్చి పట్టభద్రులను పట్టించుకోని బీజేపీకి పట్టభద్రుల ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుసంక్షేమం, మహిళల సంక్షేమం, ఆరోగ్య సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్దిని వివరించారు.
ఇవన్నీ నిజమేనని నమ్మితే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, పట్టభద్రుల ఎంఎల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల, పట్టభద్రుల తరుపున పోరాడుతారని, ఆయన్ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ర్ట అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ మంత్రి, బెల్లంపల్లి శాసన సభ్యులు వినోద్, మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు, ఎంఎల్ సీ విఠల్, ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.