calender_icon.png 20 October, 2024 | 5:31 AM

రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర

20-10-2024 01:35:01 AM

  1. ఇందుకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం
  2. సోనియా జన్మదినం నిరుద్యోగుల బలిదినం 
  3. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే
  4. ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్‌ఎస్ కుట్ర
  5. కేటీఆర్ పిచ్చికుక్కలా మొరుగుతున్నాడు
  6. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్రమాణం చేస్తావా?
  7. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ర్టంలో రిజర్వేషన్లను ఎత్తివేసేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగానే గ్రూప్ 1 పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను వర్తింపజేయకుండా జీవో 29 జారీ చేసిందన్నారు.

డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం నిరుద్యోగుల పాలిట బలిదినం కాబోతోందని పేర్కొన్నారు. గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న క్రమంలో సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వదిలారు. అనంతరం అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 29 జీవోను ఎత్తివేసి, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు. నిరుద్యోగుల ఆందోళనను ప్రభు త్వానికి తెలియజేసేందుకే ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. 

కేటీఆర్..ఓ యూజ్ లెస్ ఫెలో

బీజేపీ పట్ల నిరుద్యోగులు చూపుతున్న స్పందనను చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు తమ ర్యాలీలో చొరబడి విధ్వంసం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన తాను పోరాడుతుంటే... కేటీఆర్ పిచ్చికుక్కలా మొరుగుతున్నాడని నిప్పులు చెరిగారు. ‘కేటీఆర్.. నువ్వో యూజ్ లెస్ ఫెలో...నేను పోరాడుతుంటే నాపై వ్యక్తిగత దూషణలు చేస్తావా...

నీ డ్రగ్స్, చీకటి లీలలు తెలియదుకుంటున్నవా... కాంగ్రెస్‌తో మీ కుమ్కక్కు రాజకీయాలు తెలియదనుకుంటున్నవా.. నా జోలికొస్తే నీ బండారమంతా బయటపెడతా...”అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నేను హిందీ పేపర్ లీక్ చేసినట్లుగా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని దేవుడి ముందు నీ ఫ్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా నీకు... నువ్వు ఆ పనిచేస్తే నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధం.”అని బండి సవాల్ విసిరారు. 

నిరుద్యోగుల మాటలు ఆవేదన కలిగించాయి..

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచన మేరకు గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు అశోక్ నగర్ వెళ్లి వారి ఆవేదనను ప్రపంచానికి వినిపించేలా చేశామని తెలిపారు. గ్రూప్  బాధితుల కన్నీళ్లను చూశానని, కొందరు పోలీసులు తిట్టిన తిట్లు భరించలేక చనిపోదామని అనుకున్నట్లు తనతో చెప్పారన్నారు.

నిరుద్యోగులు చేసిన తప్పేంటని, ఎందుకు వారిపై ఇంత అరాచకానికి పాల్పడతున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ  అన్ని సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే.. కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్లను తీసేయాలని కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. కోర్టులో 22 కేసులు గ్రూప్  పై నడుస్తున్నాయని, వీటిపై లీగల్ ఓపినియన్ తీసుకుని గ్రూప్ 1 రద్దు కాకుండా చూడాలని కోరుతున్నారని తెలిపారు. 

 గ్రూప్ -1 అభ్యర్థులతో బండి భేటీ..

ఆందోళనకు ముందు శనివారం ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో గ్రూప్ -1 అభ్యర్థులు సంజయ్‌ను కలిశారు. జీవో 29తో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. హాస్టళ్లలో చదువుకుంటున్న తమను బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని మహిళా అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు.

గట్టిగా ప్రశ్నిస్తే తమపై నక్సల్స్ అని ముద్ర వేసి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలకు కొంత గడువు ఉన్నప్పుడు తెలుగు అకాడమీ సిలబస్ కూడా చదవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని సంజయ్‌ను కోరారు. ఈ సందర్భంగా వారికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున బీజేపీ పోరాడుతుందని భరోసానిచ్చారు.