25-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేష న్లను బలహీనం చేసేందుకు పలువరు అగ్రవర్ణ నాయకులు కుట్ర చేస్తున్నారని, రిజర్వేషన్ల అంశంపై ప్రధా ని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రిజర్వేషన్లు కల్పిస్తే విద్యలోనూ బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గురువారం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలని ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించినా కేంద్రంలో చలనం లేదని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోసం సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి మోదీని కలవాలని సూచించారు. దేశవ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్ నుంచి మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుడుతామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
బీసీ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలని బీసీ సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారన్నారు. త్వరలో ఎన్నికలు జరుగబోయే తమిళనాడులో మే మొదటి వారంలో పర్యటించి బీసీల సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. బీహార్‌లో పర్యటించి బీసీ వాదాన్ని వినిపిస్తామన్నారు.
మే రెండో వారంలో తెలంగాణ వ్యాప్తంగా 33జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించి బీసీ రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల వైఖరిని ప్రజలకు తెలుపుతామని చెప్పారు. మే చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సభకు వివిధ రాష్ట్రాల తాజా, మాజీ సీఎంలు, బీసీ సంఘాల నేతలను పిలుస్తామని వెల్లడించారు.