11-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): వేల కోట్ల రూపాయల టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) స్కామ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, నలుగురు బ్రోకర్లతో.. వేలకోట్ల స్కామ్ చేసేందుకు తిరుగుతున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదని విమర్శించారు.
ఢిల్లీలో ఆయనది నడవకున్నా.. పైసలు మాత్రం బాగానే సంపా దిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్‌గాంధీ అన్నారని తెలిపారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా.. పూర్తిస్థాయి మంత్రివర్గం లేదని తెలిపారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్‌పీలో మీడియాతో సోమవారం కేటీఆర్ చిట్‌చాట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యా ఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని తెలిపారు. జీహెచ్‌ఎం సీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వా రా సేకరించామని చెప్పారు. అయితే రేవంత్‌రెడ్డి కొత్త తరహా దోపిడీకి పాల్పడు తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి వెనుక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని, టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి ఆ నలుగురితో కలిసి రేవంత్‌రెడ్డి తిరుగుతున్నాడని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంత మంది రేవంత్ అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే లక్ష చదరపు అడుగులు కొనుగోలు చేశారని చెప్పారు.
భవిష్యత్తులో ఎఫ్‌ఎస్‌ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆప్రకటన తర్వాత ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడతారని తెలిపారు. అప్పుడు టీడీఆర్‌లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. టీడీఆర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రెవెన్యూను పెంచే ప్రయత్నం లేదు..
టీడీఆర్‌కు గత నెల రోజుల్లో విపరీతమైన గిరాకీ పెరిగిందని కేటీఆర్ తెలిపారు. టీడీఆర్ పేరిట భారీ లూటీ జరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా టీడీఆర్ అనుమతులు ఇచ్చామన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆ అనుమతులు ఇచ్చింది.. ఎఫ్‌ఎస్‌ఐ తీసుకొచ్చింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు.
ఎఫ్‌ఎస్‌ఐ నియంత్రణ వైఎస్‌ఆర్ హయాంలో ఎత్తివేస్తే.. తాము కొనసాగించామని గుర్తుచేశారు. రాష్ర్ట రెవెన్యూను పెంచేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీని మంచోడు అనకపోతే జైలులో వేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టుకు కృషి చేసింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు.
కేసీఆర్ వస్తారు..
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని, రేపు గవర్నర్ ప్రసంగానికి వస్తారని కేటీఆర్ చెప్పారు. ఆతర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్ స్థాయి వేరు, వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు, కారు కూతలు వినకూడదనేది ఆయన ఆలోచన అన్నారు.
ఈనెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టి, 17న తనకు ఈ కార్ రేసులో నోటీసులిస్తారని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఏం లాభమని, మళ్లీ ఒలింపిక్స్ పెడుతానంటున్నాడని..దానికి లక్ష కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకుంటోందన్నారు.