calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్ ఇయ్యకుంటే కూర్చున్న కుర్చీ గుంజేస్తాం

19-04-2025 01:27:05 AM

బీసీ వాదాన్ని అణిచివేసేందుకు కుట్రలు

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాళానికి తొక్కేస్తా

నల్లమల పులిబిడ్డను బీసీ బోన్‌లో బంధిస్తా 

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్ 

 నాగర్ కర్నూల్ ఏప్రిల్ 18 ( విజయక్రాంతి ) రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తే సీఎం కుర్చీని లాగేస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో పూలే ట్రస్ట్ వ్యవస్థాపకులు పచ్చిపాల సుబ్బయ్య అధ్యక్షతన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ చైతన్య సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల నిరుపేద బీసీలకు అందాల్సిన ఉద్యోగాలు ఆర్థికంగా ఉన్న ఉన్నత వర్గానికి దక్కే అవకాశం ఉందన్నారు.  బీసీ విద్యార్థి, నిరుద్యోగులను మోసగించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాతాళానికి తొక్కేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ వాదం చర్చకు వస్తున్న నేపథ్యంలో బీసీ ఉద్యమాన్ని అణచి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెర వెనుక కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

నల్లమల పులిబిడ్డగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తే బీసీ వాదం అనే బోనులో బంధిస్తామన్నారు. బీసీ అంటే బిగ్గెస్ట్ క్లాస్ అనుకోవాలని బీసీల ఓట్లు బీసీలే వేసుకొని రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన డిగ్రీ విద్యార్థులకు భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ పుస్తకాలను పంపిణీ చేశారు. వారితోపాటు దాసరి అజయ్ కుమార్ యాదవ్, విజయ్ కుమార్, పెబ్బేటి మల్లికార్జున్, సుంకర రమాదేవి, బైకాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.