అడ్డుపడితే రాష్ట్రం అగ్నిగుండం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): కులగణనపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కులగణన అయితా పోతదా అంటూ వెటకారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు.
సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా కులగణనపై జీవో జారీ చేసి మాట నిలబెట్టుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై ఇచ్చిన జీవో బీసీలకు ఇచ్చిన కానుకగా ఆయన పేర్కొన్నారు. కులగణనకు ఎవరైనా అడ్డుపడితే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు.
బీసీ బిడ్డలంతా కులగణన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై జీవో జారీ చేస్తే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. 24 గంటల్లోపు కులగణనపై వారి వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాభిషేకం చేయాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
20వ తేదీన అఖిలపక్ష సమావేశం జరుగుతుందని, 22వ తేదీన మేధావులు, కవులు, రచయితలతో నగరంలో సమాలోచన సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో కుందారం గణేశ్ చారి, దుర్గయ్య గౌడ్, ఎన్.బాలరాజు, ఎం.భాగయ్య, గూడూరు భాస్కర్, వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.