calender_icon.png 28 September, 2024 | 12:57 PM

డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటుకు స్థలాల పరిశీలన

28-09-2024 02:10:32 AM

జవహర్‌నగర్‌పై భారం తగ్గించేందుకు చర్యలు

గ్రేటర్ పరిధిలోని ఇతర మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటుకు కసరత్తు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గ్రేటర్‌లో చెత్త డంపింగ్ కేంద్రాలను మరిన్ని పెంచేందుకు బల్దియా కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం జవహర్‌నగర్‌లోని చెత్త శుద్ధి కేంద్రానికి జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర ప్రాంతాల్లోని 17 మున్సిపాలిటీలు సైతం చెత్త డంపింగ్ విషయంలో జవహర్‌నగర్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది.

జీహెచ్‌ఎంసీ నుంచి ప్రతిరోజూ జవహర్‌నగర్‌కు 7500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు పైగా తరలిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తతో మొత్తం ప్రతిరోజూ ఇక్కడ 9 వేల మెట్రికల్ టన్నుల వ్యర్థాలు అక్కడ పేరుకుపోతున్నాయి.

దీంతో ఆ తరహాలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో  డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసే పనిలో అధికారుల బృందం నిమగ్నమైంది. ఇప్పటికే ప్రతిపాదిత స్థలాలను సైతం పరిశీలిస్తున్నది.

ప్యారా నగర్‌లో ఆధునిక శుద్ధికేంద్రం

సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో గతంలోనే 152 ఎకరాల స్థలంలో యూరోపి యన్ టెక్నాలజీతో వినూత్నమైన, ఆధునిక పద్ధతిలో చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. ఈ ప్లాంట్‌లో 15 మెగావాట్ల సామర్థ్యంతో వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ట్రక్కుల ద్వారా వచ్చిన వ్యర్థాలను అండర్ గ్రౌండ్ బంకర్‌లో వేసి తడి, పొడి వ్యర్థాలను వేరు చేయనున్నారు.  పొడి వ్యర్థాల నుంచి విద్యుత్, తడి వ్యర్థాల నుంచి సీబీజీ గ్యాస్ ఉత్పత్తి చేస్తారు. సంగారెడ్డి జిల్లా ప్యారా నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 24.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో 100 ఎకరాలు, దుండిగల్‌లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలను అధికారులు గుర్తించారు. ప్రతిపాదిత స్థలాలను జీహెచ్‌ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు.