విద్యాశాఖ సెక్టోరల్ అధికారి నారాయణ..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మానసిక ఒత్తిడిని జయించాలని జిల్లా విద్యా శాఖ సెక్టోరల్ అధికారి నారాయణ అన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం అమలు పర్యవేక్షణలో భాగంగా బుధవారం మావల, దేవాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కార్యక్రమ షెడ్యూల్లో భాగంగా మానసిక ఒత్తిడిని జయించడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు సమయపాలన అలవర్చుకోవడంతో పాటు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడం ద్వారా ఆయా అంశాలలో వెనుక పడకుండా ఉంటారని సెక్టోరల్ అధికారి నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సుజాత్ ఖాన్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.