calender_icon.png 12 January, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపశ్యనతో క్యాన్సర్‌ను జయించా!

17-12-2024 12:00:00 AM

క్యాన్సర్ సోకితే అనవసరమైన భయాలు.. అపోహలు అవసరం లేదు. క్యాన్సర్‌కు సరైన చికిత్స తీసుకుంటూ.. క్రమపద్ధతిలో విపశ్యన ధ్యానం, ప్రకృతి యోగా చేస్తూ నేచర్‌క్యూర్, పౌష్టికాహారంతో క్యాన్సర్‌ను జయించవచ్చని అంటున్నారు “సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ సీనియర్ మేనేజర్ మందలపర్తి నిర్మల”. మూడు స్టేజీల్లో క్యాన్సర్‌ను జయించి.. ఇప్పటికీ యాక్టివ్‌గా ఉంటూ ఇతరులకు యోగా క్లాసులు తీసుకుంటూ ఎందరికో స్ఫూర్తిని నింపుతున్నారు నిర్మల. క్యాన్సర్‌ను ఎలా జయించింది.. ఎలాంటి నియమాలు పాటించిందో.. విజయక్రాంతితో పంచుకున్నారామె..

                                                                                                                                                                                                                                                                                                  రూప

నా జీవితంలో చిన్నప్పుడు పంటినొప్పి సమస్యతో బాధపడ్డా. తర్వాత మళ్ళీ క్యాన్సర్‌తో పోరాడాల్సి వచ్చింది. అంతవరకు నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి అనారోగ్య సమస్యలతో చనిపోయింది. మావారు యాక్సిడెంట్‌లో మరణించారు. ప్రస్తుతం నేను, మాబాబు ఉంటున్నాం. మా  ట్యూషన్ టీచరు, మా ఫ్యామిలీ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం.

ఆమె నా ముఖంలో కొన్ని మార్పులను గమనించింది. ఎందుకో నేను ఆమెకు ముందులాగా కన్పించలేదంట.. నా ముఖంలో తేజస్సు తగ్గిందని చెప్పింది. కాని నేను అద్దంలో చూసుకొంటే ఏం తేడా కప్పించడలేదు. కానీ ‘నా ఛాతిలో చిన్న చిన్న గడ్డలు ఉండేవి.. దేనికైనా మంచిదని అనుమానంతో నాంపల్లిలోని మెడ్విన్ ఆసుపత్రిలో డాక్టర్ బాలయ్యగారిని కలిశాను. ఆయన ఒకటి రెండుసార్లు పరీక్షలు నిర్వహించి.. క్యాన్సర్ అని రూఢీ చేసుకున్నాక..  నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా’ అని చెప్పారు.

ఆ మాట వినగానే కళ్లనిండా నీళ్లు తిరిగాయి. ఆ డాక్టర్ నాభుజం మీద చేయివేసి భయపడవద్దు.. దీనికి చికిత్స ఉంది. ఆపరేషన్ చేస్తే సరిపోతుంది అని ఓదార్చారు. అలా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నా.

విపశ్యన ధ్యానంతో

మనిషికి ధ్యానం మానసిక, శారీరక శక్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇది నేను బలంగా నమ్ముతాను. నా స్నేహితులలో ముఖ్యరాలైన జయలక్ష్మి నన్ను విపశ్యన ధ్యాన కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడ పది కోర్సులో నన్ను చేర్పించింది. ఆ రోజుల్లో నేర్చుకొన్న ధ్యానం నా ప్రాణానికి ఎంతో హాయిని కలిగించింది.

అనంతరం ఇంట్లో కూడా ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేశా. అలా ప్రతిరోజు ఒక గంట పాటు ధ్యానంలో కూర్చుంటాను. మళ్ళీ ఒక గంటపాటు యోగ చేస్తాను. ఇలా చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. మొదటి, రెండోసారి క్యాన్సర్ వచ్చినప్పుడు కాస్త కోలుకున్నా.. కానీ మూడోసారి కాస్త ఎక్కువ సమయం పట్టింది. కాని ప్రాణమయితే పోలేదు. శరీరం బలహీనమైంది కాని మానసిక బలం మరింత పెరిగింది. క్యాన్సర్‌కి మనోబలంకిమించిన మందు మరొకటి లేదు.   

ప్రకృతి యోగ, నేచర్ క్యూర్

మన హైదరాబాద్‌లోనే డాక్టర్ సరస్వతిరావుగారి వద్ద యోగ శిక్షణ తీసుకున్నాను. డాక్టర్ గురించి ఒక విషయం చెప్పాలి. ఆమె యోగా, నేచర్ క్యూర్ పేరిట అందరికి ఉచితంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె చెప్పినట్లు నేను ప్రాక్టీస్ చేశాను. తద్వారా నాకు అజీర్తి సమస్యలు తగ్గుముఖం పట్టాయి. 

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేను దాన్ని సంపూర్ణంగా నమ్ముతా. అందుబాటులో ఉన్నవారికి ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో యోగాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశా. యోగా క్యాంపులు పెట్టడం ప్రారంభించాను. 

నేనిచ్చే సలహాలు..

క్యాన్సర్ అంటే భయం వద్దు. క్యాన్సర్‌లో చాలా రకాలున్నప్పటికీ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌కి అసలు భయపడవద్దు. ధైర్యంగా ఉండాలి. క్యాన్సర్ విరుగుడికి మంచి మందులు వచ్చాయి. ప్రతి సంవత్సరం మహిళలు మెమోగ్రఫీ చేయించుకుంటూ ఉండాలి. క్యాన్సర్ వచ్చిన వారు డాక్టర్ సూచించిన మందులను తప్పక వాడాలి. 

మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మాకు స్థోమత లేదు తినడానికి లేదా నోరు చేదుగా ఉంది, వాంతు లు వచ్చేటట్టు ఉంది, తినబుద్ది కావడం లేదంటూ సాకులు చెప్పకండి. వీలైనంతవరకు పౌష్టికాహారం తీసుకోవాల్సిందే. ధ్యానం అలవాటుచేసుకోవాలి. అది క్యాన్సర్ రోగులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. విపశ్యన ధ్యానమైతే మరి మంచిది. శారీరకంగాను, మానసికంగాను ఎంతో ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. 

తప్పక పాటించాల్సినవి..

ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. పని ఒత్తిడి నుంచి ఉపశమ నం పొందాలంటే ధ్యానం, యోగ చేయడం మహిళలు అలవరచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు. పదవీ విరమణ తర్వాత కాస్త సమయాన్ని సమాజం కోసం వెచ్చించడానికి ప్రయత్నించాలి. ఆత్మన్యూనతా భావం వీడి ధైర్యంగా మసలుకోవాలి. ఇంట, బయటా సమస్యలను చూసి భయపడకూడదు. వాటిని పరిష్కరించుకొనే విధంగా తమను తాము మలచుకోవాలి. 

బ్రెస్ట్ నుంచి బ్రెయిన్..

కీమో తీసుకున్నప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమి రాలేదు. అంటే విరోచనాలు, వాంతులు అని ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదు. కాకపోతే నోరు ఎండిపోయినప్పుడల్లా పండ్లు తినేది. ఉన్నట్టుటుండి.. నోరు ఎండిపోవడం.. తల తిరగడం అయ్యేది. అప్పుడు ఏమైనా పండ్లు తింటే తగ్గిపోయేది. అలాంటి  ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కువగా నారింజ పండ్లు తినేది. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా త్వరగా కోలుకున్నా.. అప్పుడు నా వయసు కూడా తక్కువే.

ఒక్క కీమోథెరపీ పూర్తవ్వగానే ఆఫీసుకు వెళ్లాను. అలా నా రోజువారీ పనులన్ని నేనే చేసుకునేది. మళ్లీ రెండో కీమోథెరపీ అప్పుడు రెండు రోజులు సెలవులు తీసుకునేదాన్ని. ఈ క్రమంలోనే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌కు దారి తీసింది. అయినా ఏ మాత్రం భయపడకుండా.. సర్జరీ చేయించుకున్నా.  అలా ఆరు కీమోథెరపీలు, 25 రేడియేషన్లు ఇచ్చారు.

ఇవన్నీ పూర్తియిన కొద్దిరోజులకు విపశ్యన ధ్యాన కేంద్రంలో చేరాను. ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. అలాగే ఆహారం కూడా రెగ్యులర్ గా తీసుకునేదే తీసుకుంటున్నా.. ప్రత్యేకమైన ఆహారం ఏమి తీసుకోవడం లేదు. కాకపోతే మెడిసిన్స్ వాడుకుంటూ.. క్రమం తప్పకుండా పోషకాహాం తీసుకోవాలి. విపశ్యన ధ్యానం క్యాన్సర్‌పై మంచి ప్రభావాన్ని చూపించింది.   

ఇది సాధ్యమేనా? 

మాజీ టీమిండియా క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇటీవల ఓ మీడియా సమావేశంలో స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్య గురించి చెప్పిన కొన్ని విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ కేవలం డాక్టర్లమీదనే ఆధారపడకుండా ఆయుర్వేదం, ఆహార నియమాలత తీవ్రమైన స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడిందని సిద్దూ చెప్పారు. నవజ్యోత్ కౌర్ ట్రీట్మెంట్ తర్వాత క్రమశిక్షణ, కఠినమైన దినచర్య, డైట్ ద్వారానే క్యాన్సర్‌ను జయించిందని తెలిపారు.

సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌ను డాక్టర్లు బతికే అవకాశం కేవలం మూడు శాతం మాత్రమే ఉందని చెప్పినప్పటికీ తన భార్య ఆహారంలో తులసి ఆకులు, వేప ఆకులు, పచ్చి పసుపు, యాపిల్ సైడర్, నిమ్మరసం, వెనిగర్, కొబ్బరి నీరు, ఉసిరి వంటి వాటిని చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్ ను జయించినట్లు సిద్దూ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినా విషయం తెలిసిందే. అలాగే గుమ్మడి, దానిమ్మ, క్యారెట్, ఉసిరి, బీట్‌రూట్‌తో చేసే జ్యూస్‌లు తాగేదని, వాట్ నట్స్ తినేదని సిద్దూ చెప్పారు. అలా సిద్దూ రోజూ డైట్ ప్లాన్ ద్వారా క్యాన్సర్ నుంచి జయించిందని సిద్దూ తెలిపారు.

ఉదయం: కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు, బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తన భార్య తీసుకుందని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు, బెల్లం, యాలకులు తీసుకున్నట్లు సిద్దూ తెలిపారు.

సాయంత్రం: కౌర్ సాయంత్రం తీసుకునే ఆహారంలో రోటీలు కూడా ఉండేవి కాదని.. క్వినోవా మాత్రమే తీసుకునేదని చెప్పారు. ఇది కూడా కీలకపాత్ర పోషించిందని సిద్దూ తెలిపారు.