- రైల్వే రీచ్ విస్తృతం చేస్తున్నాం
- 180 కి.మీ వేగంతో వందేభారత్ పరుగు
- బుల్లెట్ రైలు ప్రారంభం ఎంతో దూరం లేదు
- ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
- వర్చువల్‌గా చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం
- హాజరైన గవర్నర్, కేంద్ర మంత్రులు
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా రైల్వేల కనెక్టివిటికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ప్రజలకు రైల్వే రీచ్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, అమృత్ భారత్, నమో భారత్ రైళ్ల సౌకర్యం ద్వారా దేశానికి కొత్త గుర్తింపును తీసుకొస్తున్నామని చెప్పారు.
ఎక్కువ దూర ప్రయాణాలను సైతం తక్కు వ సమయంలో పూర్తిచేసే ఆలోచనతో ప్రజలున్నారని.. వారి ఆలోచనలకు అనుగుణంగా తాము మేం పనిచేస్తున్నాని తెలి పారు. వందేభారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఇది కేవ లం ప్రారంభం మాత్రమేనని దేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు.
రైల్వేల ప్రయాణం ఓ మధుర స్మృతిగా నిలిచిపోయేలా చేస్తామని హామీనిచ్చారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌తోపాటు జమ్మూకశ్మీర్, ఒడిశా రాష్ట్రాల్లో వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 2014 వరకు దేశంలో 35 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ మాత్రమే జరిగిందని, నేడు దాదాపుగా 100 శాతం ఎలక్ట్రిఫి కేషన్ పూర్తిచేసుకోబోతున్నామని స్పష్టంచేశారు.
30 వేల కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేసేలా కొత్త రైళ్లు వేసినట్టు తెలిపారు. వేల సంఖ్యలో రైల్ ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ నిర్మిస్తున్నామన్నారు. తద్వారా సామాన్య ట్రాక్‌లపై ఒత్తిడి తగ్గి, ప్రజల ప్రయాణ సమయం తగ్గేందుకు వీలుంటుందని చెప్పారు.
వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, రైల్వే స్టేషన్లపై సోలార్ ప్యానెళ్ల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి వంటి నిర్ణయాలను విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులను అవి అందుబాటులో ఉన్న ప్రాంతాలనుంచి చేరవేస్తున్నామన్నా రు. దీని వల్ల పారిశ్రామికీకరణకు కూడా ప్రోత్సాహం అందుతోందన్నారు.
గత పదేళ్లుగా దేశంలో రైల్వేల పురోగతి వేగవంతంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. తాము నాలుగు అంశాలమీద రైల్వేల పురోగతి చేస్తున్నామని.. రైల్వేల మౌలిక సవతుల ఆధునీక రణ, ప్రయాణికులకు ఆధునిక వసతులు, మారుమూల ప్రాంతాలకు అనుసంధానం, రైల్వేల ద్వారా ఉపాధి కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం అనే అంశాలపై ముందుకెళ్తున్నామని స్పష్టంచేశారు.
ఈ మూడు కార్యక్రమాల ద్వారా 21వ శతాబ్దంలో అవసరమైన మౌలికవసతుల కల్పన జరుగు తోందని వెల్లడించారు. కొత్త ఉపాధి కల్పన కూడా పెరుగుతుందని.. 2014లోనే భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే సంక ల్పంతో పని ప్రారంభించామని గుర్తుచేశారు. 2025 ప్రారంభం నుంచే దేశం కనెక్టివిటీ వేగాన్ని పెంచిందన్నారు.
దేశంలో వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఉత్తరాన జమ్మూకశ్మీర్, తూర్పులో ఒడిశా, దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన సందర్భమిదని పేర్కొన్నారు.
ఈ రాష్ట్రాల్లో ఆధునిక పురోగతికి బాటలు పడ్డాయని తెలిపారు. ఇకపై దేశమంతా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రం అమల్లో విశ్వాసపూరితంగా ముందుకెళ్తోందని చెప్పా రు. ఈ సందర్భంగా ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓఆర్‌ఆర్ అనుసంధానంతో పారిశ్రామికాభివృద్ధి
చర్లపల్లి టెర్మినల్‌కు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానత ద్వారా పారిశ్రామికాభివృద్ధికి బాటలు పడతాయని ప్రధాని మోదీ అన్నారు. స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ స్టేషన్ లో సౌర విద్యుదుత్పత్తి కూడా చేస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికులకు, పరిశ్రమ లకు ఈ టెర్మినల్ ఎంతో ఉపయుక్తం కానుందని పేర్కొన్నారు.
2014లో దేశంలో 74 విమానాశ్రయాలుంటే.. ఇప్పుడు 150కు చేరిందన్నారు. 2014లో 4 నగరాల్లో మెట్రో ఉంటే.. ఇప్పుడు 17 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు మెట్రో సేవలు విస్తరిస్తామని చెప్పారు. రోడ్డు నెట్ వర్క్ కూడా చాలా వేగంగా ముందుకెళ్తోందని, అనుసంధానత విషయంలో తాము రాజీపడకుండా పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు.
జమ్మూ డివిజన్‌తో కశ్మీర్‌కు దేశవ్యాప్తం కనెక్టివిటీ
జమ్మూ డివిజన్ ద్వారా జమ్మూకశ్మీర్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, లేహ్ లద్దాఖ్ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా లాభం చేకూరనుం దని ప్రధాని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కీలకమైన చరిత్రాత్మక వంతెన నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
జగన్నాథుడి ఆశీస్సులతో ఒడిశాకు సముద్ర తీరంతోపాటు విస్తృతమైన ఖనిజ నిక్షేపాలున్నాయని, అందుకే రైల్వే అనుసంధానతకు సంబంధించి రూ.70 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఒడిశాలో ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధిం చిన అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ మనది : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ మనదేనని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైల్వేల విస్తరణ అత్యంత వేగంగా సాగుతోందని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని అందుకు వందేభారత్ రైలు ఒక ఉదాహరణ అని చెప్పారు. చర్లపల్లిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక రైల్వే టెర్మినల్ ఈ ప్రాంత ప్రజలకు రైల్వే సేవలను మరింత చేరువ చేస్తుందన్నారు.
అద్భుత రైల్వే టెర్మినల్‌ను నిర్మించినందుకు ద.మ.రైల్వే అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, డీఆర్‌ఎం భారతేశ్ జైన్, సీపీఆర్‌వో శ్రీధర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కనెక్టివిటీ చిరునామాగా చర్లపల్లి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గత నాలుగేళ్లుగా చర్లపల్లి అభివృద్ది పనులను తాను పర్యవేక్షించాలనని, ఇప్పుడు ఇది అందుబాటులోకి రావడంతో నగరంలో రైల్వే కనెక్టివిటీకి చర్లపల్లి చిరునామా గా మారుతుందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ టెర్మినల్ వల్ల రైల్వే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయ న్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నామని, ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా ఉండబో తోందని చెప్పారు.
రాష్ట్రంలో40 స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. త్వరలో అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను నగరం నుంచి ముంబైకి నడిపిస్తామని హామీ ఇచ్చారు. కాజీపేట రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయని, దీని ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షంగా, అనేక మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ఎంఎంటీఎస్ రైల్వేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేంద్రానికి బకాయి పడిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు అడిగినా స్పందించలేదని చెప్పారు. అయినా తామే ముందడుగు వేసి రైళ్ల రాకపోకలు సాగేలా చేస్తున్నామని స్పష్టంచేశారు. ఎంఎంటీఎస్ రైళ్లను యాదగిరిగుట్ట వరకు పొడింగిం చేందుకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
భూసేకరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను చేరుకునేందుకు అప్రోచ్ రోడ్లు కావాలని, ఇందుకు రాష్ర్ట ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. గతంలో ఈ అఁశంపై ఎన్నో సార్లు కేసీఆర్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ మైనా అప్రోచ్ రోడ్లకు కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు.
స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణలో తొలి టెర్మినల్ ఇదే : కేంద్ర మంత్రి బండి సంజయ్
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణలో కొత్తగా నిర్మించిన మొట్టమొదటి రైల్వే టెర్మినల్ ఇదేనని ఆయన స్పష్టంచేశారు. ఈ టెర్మినల్ ప్రారంభంతో సుమారు 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ట్రాఫిక్ భారం తగ్గే అవకాశముందని చెప్పారు.
అత్యాధునిక వసతులతో నిర్మించిన ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లను చూస్తుంటే ముచ్చటేస్తోందని తెలిపారు. బీజేపీ తొలిసారి అధికారం లోకి వచ్చాక వాజ్‌పేయి ఆధ్వర్యంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల విస్తరణ జరిగితే..
మోదీ సారధ్యంలో రోడ్లు, రైల్వే, ఏవియేషన్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక సదుపాయలు కల్పించేందుకు అత్యధిక నిధులను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో రూ.32,946 కోట్ల వ్యయంతో మొత్తం 20కి పైగా ప్రాజెక్టులు 2,298 కిలోమీటర్ల మేర పనులను కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
గతంలో ప్రత్యేక రైల్వే బడ్జెట్ ఉన్నా ఇంత అభివృద్ధి లేదు: ఎంపీ ఈటల
యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ఉన్నా రాష్ట్రానికి రైల్వే పరంగా ఇంతటి కేటాయింపులు, అభివృద్ధి లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రధాని మోదీ గొప్ప మనసుతో రూ.400 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైల్వే స్టేషన్లలో దుర్గంధం రాజ్యమేలేదని, ఇప్పుడు ప్రపంచంతో పోటీపడేలా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. చర్లపల్లి పారిశ్రామిక వాడకు కొత్త టెర్మినల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు
చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు బయలుదేరింది. ఈ టెర్మినల్ ప్రారంభమయ్యాక ఇదే మొట్టమొదటి రైలు కావడం విశేషం. ఈ రైలు ప్రారంభంతో చర్లపల్లి నుంచి రైల్వే సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు నెలల్లో దశలవారీగా చర్లపల్లి నుంచి పెద్ద ఎత్తున రైళ్లు ప్రారంభమవుతాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
అప్రోచ్ రోడ్ల బాధ్యత రాష్ట్రానిదే: రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న
చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వదని, అప్రోచ్ రోడ్లు అనేవి రాష్ట్రం పరిధిలోనివని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న స్పష్టంచేశారు. చర్లపల్లి వేదికగా మంత్రి శ్రీధర్‌బాబు అప్రోచ్ రోడ్ల కోసం కేంద్రం నిధులను కోరగా, అదే వేదికపై నుంచి సోమన్న కుదరదని చెప్పేశారు.
కర్ణాటకలోనూ ఇలాంటి సమస్యే వచ్చిందని, అప్పుడు కూడా కేంద్రం స్థానిక రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని గుర్తుచేశారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని, అప్రోచ్ రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం వేయాలని చెప్పారు. దక్షిణాదిలో చర్లపల్లి అద్భుతమైన స్టేషన్‌గా అవతరించిందని అన్నారు.
వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, సోలార్ పవర్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా చర్లపల్లి ఎకో ఫ్రెండ్లీ స్టేషన్‌గా గుర్తింపు పొందనుందని చెప్పారు. దేశంలో 136 రూట్లలో వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయని భవిష్యత్తులో వీటి సంఖ్య మరింతగా పెరుగుతుందని తెలిపారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.5071 కోట్లను అందించామన్నారు.
చర్లపల్లికి అప్రోచ్ రోడ్లకు నిధులివ్వండి : మంత్రి శ్రీధర్ బాబు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ టెర్మినల్ భవిష్యత్తులో హైదరాబాద్, సికిం ద్రాబాద్ స్టేషన్లకు మించి ప్రయాణికులకు సేవలు అందిస్తుందన్నారు.
తెలం గాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని ఎన్నో ఏళ్లుగా తాము కేంద్రా న్ని అడిగినట్టు గుర్తుచేశారు. ఈ రైల్వే టెర్మినల్‌కు అప్రోచ్ రోడ్లు వేసేందుకు తాము కూడా కేంద్రానికి సహకరిస్తున్నామని, ఇప్పటికే ఎంపీ ఈటలతో ఈ అంశంపై సమావేశం జరిగిందని చెప్పారు.
చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్ రోడ్లు వేసే బాధ్యత తాము తీసుకుంటామని, అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రోడ్లలా అప్రోచ్ రోడ్లను వేస్తామని.. ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ పెంచేలా కేంద్రం సహకారం అందించాలని ఆయన కోరారు.
ఆర్‌ఆర్‌ఆర్ వెంట రైల్వేలైన్ కావాలి
- డ్రైపోర్ట్ ఇవ్వండి
- బందర్ పోర్టు నుంచి డెడికేటెడ్ లైన్ వేయండి
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
భారతదేశ అభివృద్ధికి రైల్వేల అభివృద్ధి కీలకమని, తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి కూడా రైల్వేల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవలో సీఎం వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్, స్టేషన్‌ను పూర్తి చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు డ్రై పోర్ట్‌ను ఇవ్వడం తోపాటు అక్కడి నుంచి బందర్ పోర్టుకు ప్రత్యేకంగా రైల్వే లైన్ వేయాలని ప్రధానిని కోరారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ వంతుగా తెలంగాణ నుంచి ఒక ట్రిలియన్ డాలర్ జీడీపీని అందిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. దక్షిణ కొరియా పర్యటనలో డెడికేటెడ్ కారిడార్‌లను చూశామని అవి ఆ దేశ అభివృద్ధిలో ఎంతో కీలకంగా ఉన్నాయన్నారు.
తెలంగాణలో 370 కి.మీ మేర రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతున్నామని, ఆర్‌ఆర్‌ఆర్ వెంట రీజనల్ రింగ్ రైల్ నిర్మాణం ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో గత పదేళ్లుగా మెట్రో రైల్ అభివృద్ధి జరగడం లేదని అన్నారు.
మెట్రో రైల్ ఫేజ్- సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు. తన నియోజకవర్గాన్ని కవర్ చేసే వికారాబాద్ రైలు మార్గంతో పాటు కల్వకుర్తి కల్వకుర్తి డోర్నకల్ రైల్వేలైన్లు వేయాలని కోరారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.