ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
చేవెళ్ల, జనవరి 23: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. నాయకులు రిజర్వేషన్ల కోసం ఆలోచించకుండా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. గురువారం శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ పాలకవర్గం చివరి సమావేశానికి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ. పదవీకాలం ముగిసినప్పటికీ నాయకులు అధికారులు, ప్రజల సమన్వయంతో మున్సిపల్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు విలువలతో కూడిన రాజకీయం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మున్సిపల్ కొత్త భవనంతో పాటు బీసీ భవన్కు స్థలం కేటాయిస్తే ఎమ్మెల్యే సహకారంతో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
బుల్కాపురం, శంకర్ పల్లిలో హిందూ స్మశాన వాటికల ఏర్పాటుకు సహకరిస్తామని మాటిచ్చారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో మిగిలిపోయిన సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మున్సిపాటిలీ మిగిలిపోయిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలో సహకారంతో ఎన్ని నిధులైనా తీసుకొస్తామని చెప్పారు.
గత ఐదేళ్లలో చైర్ పర్సన్ , వైస్ చైర్మన్, కౌన్సిలర్లు చాలా బాగా పనిచేశారని అభినందించారు. చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో రూ. 92 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఇన్నాళ్లు సహకరించిన ప్రతిఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహేందర్ రెడ్డి, యాదయ్య కలిసి చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లను శాలువాలతో సన్మానించారు.