ఎంపీగా ‘బండి’ ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలి..
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, మే 11 (విజయక్రాంతి): కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గెలుపు ఖాయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణంలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమవేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతున్నదని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృ త్వ ధోరణికి చరమగీతం పాడడానికి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, నూతన పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు.
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. మతపరమైన లబ్ధి పొం దాలని, విద్వేషాల ద్వారా బీజేపీ గెలవాలని చూస్తున్నదన్నారు. ఎంపీలుగా పనిచేసిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌లు ప్రజలకు ఏం మేలు చేశారో చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పైకి.. ‘జై శ్రీరాం’ అని లోలోపల ‘రిజర్వేషన్లకు రాం రాం’ అంటుందన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ స్థానికేతరుడని, అందుకే ఆయన గతంలో ఇక్కడి అభివృద్ధికి వచ్చిన నిధులు ఆయన ప్రాంతానికి తరలించారని గుర్తుచేశారు.
ఎంపీగా వెలిచాల రాజేందర్‌రావు గెలిచి శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకువస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, దేశంలో శాంతి లేదన్నారు. కాంగ్రెస్ కేంద్రం లో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంపిణీ చేస్తుందని, పుస్తెలు గుంజుకుంటారని, అర్బన్ నక్సలిజం వస్తుందని ప్రధాని మోదీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 370 నుంచి 400 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్తూ, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు.
ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాజేందర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలం గాణలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్, నాయకుడు శ్రీరాం చక్రవర్తి పాల్గొన్నారు.