calender_icon.png 15 November, 2024 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ప్రధానిని కాంగ్రెస్ సహించట్లేదు

10-11-2024 02:04:21 AM

  1. దేశంలో ఓబీసీలను విభజించేందుకు ప్రయత్నిస్తోంది
  2. రాజకీయ లబ్ధి కోసమే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది
  3. ఖాళీ పేజీల పుస్తకాన్ని చూపి రాజ్యాంగాన్ని అవమానిస్తోంది
  4. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

నాందేడ్, నవంబర్ 9: రాజకీయ ప్రయోజనాల కోసం ఓబీసీలను కాంగ్రెస్ విభజించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా నాందేడ్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఓబీసీ వ్యక్తి ప్రధానిగా ఉండటం కాంగ్రెస్ అంగీకరించలేకపోతుందని ఆరోపించారు.

ఒక ఓబీసీ ప్రధాని వెంట ప్రజలంతా రావడం కాంగ్రెస్‌కు సహించడం లేదన్నారు. అందుకే ఓబీసీ వర్గానికి ఏకీకృత గుర్తింపు తొలగించి చిన్న కుల సమూహాలుగా మార్చి విభజన రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని మోదీ మండిపడ్డారు.    

అది అసలు రాజ్యాంగం కాదు

ఓబీసీల గుర్తింపును తొలగించి, వారిని కులాలుగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఓబీసీలను చిన్నవర్గాలుగా విభజించి దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది. కాంగ్రెస్ రహస్య ఎజెండా గురించి మీరు తెలుసుకోవాలి. మనందరం కలసికట్టుగా ఉంటే సురక్షితంగా ఉంటాం అని మోదీ పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో మోదీ ఇలాంటి నినాదం చేయడం ఇది రెండోసారి.

ధూలేలోనూ ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. నాందేడ్‌లో మాట్లాడుతూ.. దళితులు, ఆదివాసీలను రెచ్చగొట్టేందుకు ఇండియా కూటమి ఖాళీ పేజీలతో కూడిన రాజ్యాంగ ప్రతులను పంచుతూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తారని మోదీ ఆరోపించారు. ఎరుపురంగు అట్టతో ఉన్న ఖాళీ పేజీల పుస్తకాన్ని రాహుల్ చూపిస్తున్నారని, దాన్ని రాజ్యాంగమని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

అది అసలైనది కాదని, నకిలీదని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాకిస్థాన్ ఎజెండాను ప్రోత్సహిస్తున్నారని, వేర్పాటువాదుల భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది తగదని హితవు పలికారు. ప్రజలు దీన్ని ఎప్పటికీ అంగీకరించరని పేర్కొన్నారు.

మహాలో మళ్లీ బీజేపీనే..

అభివృద్ధి దేశాల సరసన భారత్‌ను నిలబెట్టేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని, దీన్ని దేశ ప్రజలు గుర్తించారని మోదీ అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ప్రభుత్వంలో మహారాష్ట్రలో మహిళా సాధికారతే లక్ష్యంగా మరిన్ని పథకాలు తెస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా నవంబర్ 23న ఫలితాలు వెలువడుతాయి.