calender_icon.png 1 February, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ దొంగాట

31-01-2025 11:26:22 PM

విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శ...

ఖమ్మం (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ పార్టీ దొంగాట ఆడుతుందని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసి, సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ సభలు చేస్తున్నా పార్టీ పరంగా స్పందించడంలేదని అన్నారు. వాస్తవానికి ఆ పార్టీ ఎలాంటి కార్యాచరణను అమలు చేయడం లేదన్నారు. ఆ పార్టీ వైఖర్ని చూస్తుంటే వర్గీకరణకు వ్యతిరేకమని భావించాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ భావించాల్సి వస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు పదవులు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవితో పాటు అసెంబ్లీ స్పీకర్ స్ధానాలను సైతం మాదిగలకు  ఒక్కటి కూడా ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ వర్గాల వారి ఉన్నతి కోసం దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు, 1025 గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటినన్నింటిని నిర్వీర్యం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై శ్రద్ధ వహించడం లేదని అన్నారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహానికి తాళాలు వేశారని, సచివాలయానికి కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేసి, ఉద్యోగాలు, స్ధానిక సంస్ధల్లో దామాషా ప్రకారం అమలు చేయాలని సండ్ర కోరారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ లైబ్రరీ చైర్మన్ ఖమర్, నాయకులు పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, బిచ్చల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.