calender_icon.png 31 March, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదులను ఆపింది కాంగ్రెస్సే

21-03-2025 12:00:00 AM

  • టీడీపీ హయాంలో ప్రారంభిస్తే.. బీఆర్‌ఎస్ హయాంలో తుది దశకు..
  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ, మార్చి 20(విజయక్రాంతి): టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే పదేళ్ల పాటు ఆ పనులను ఆపింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం జనగామ జిల్లా దేవరుప్పులలో దీక్షలు చేపట్టారు.

కార్యక్రమానికి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవాదులను టీడీపీ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ విస్మరించిందని, ఆ పనులను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తుది దశకు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణలో 5 లక్షల 57 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చేలా కేసీఆర్ రూపకల్పన చేస్తే ఆ నీటిని ఎలా వాడాలో తెలియని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.

ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యశ్వంతపూర్, బయ్యన్న, ఆకేరు వాగులు ఎండిపోయాయన్నారు. సమయానికి పంపులు ఆన్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, ఇది రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన కరువేనని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎండాకాంలోనూ కాల్వలు సరిగా లేకున్నా రిజర్వాయర్లు, చెరువులు నింపి చెరువులను మత్తడి పోయించారని గుర్తు చేశారు.

పాలకుర్తిలో తన హయాంలో రూ.300 కోట్లతో రిజర్వాయర్, కాల్వ మరమ్మతులు ప్రారంభిస్తే కాంగ్రెస్ ఆపేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంటలు  ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.