calender_icon.png 7 February, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలానుగుణంగా కాంగ్రెస్ మారాలి

10-12-2024 12:00:00 AM

భారత స్వాతంత్య్రోద్యమానికి, స్వాతంత్య్రానంతర పాలనకు సమానార్థకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం నిస్తేజంగా,నీరసంగా చతికిలబడి ఉంది. అందుకే బలమైన  బీజేపీని ఎన్నికల్లో ఎదుర్కొడంలో కాంగ్రెస్ వ్యూహాత్మ కంగా విఫలమవుతోంది. బీజేపీ ఎన్నికల విజయాలకు కారణాలు ఎన్నికల ఎత్తుగడలు, ఆర్థ్ధిక వనరులు, శ్రమించే కార్యకర్త లు, ఆరెస్సెస్ తోడ్పాటు కారణం అయినప్పటికీ... ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీ నతలు, సరైన నాయకత్వ పటిమ లోపించటం. ఇండియా కూటమి సభ్యుల సంఖ్య పెరగక పోగా ఉన్న వారిలో కూడా ఐక్యత లేదు. కాంగ్రెస్ కూటమిలో అంతర్గత సమస్యలు లోతైనవి. వాటిని పరిష్కరించుకో వటంలో విఫలం అయితే బీజేపీని ఎదిరించటం అనే మాట మరచిపోవాలి. ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా ఇండియా కూటమి ఆత్మ పరిశీలన చేసుకోవటం లేదు. బీజేపీని ఓడించాలనే బలమైన కసి,సంకల్పబలం, ఐక్యత కూటమి సభ్యులలో లేదు. అవి అవసరం అయినప్పుడే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. 

బలహీనంగా సంస్థాగత నిర్మాణం 

కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలహీనత దాని సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉండ టం. ఆధునిక రాజకీయ అవసరాలకు తగినట్లుగా మార్పు చెందడంలో విఫలమవ డమే. బీజేపీ తన పునాదులను గట్టి చేస్తూ ఒక బలమైన క్యాడర్‌ను నిర్మించగా, కాంగ్రె స్ మాత్రం అసంఘటితంగా ఉంది. ఎన్నికల సమయంలోనే కాకుండా, బీజేపీ యంత్రాంగం ఎప్పటికీ చురుకుగా ఉం టుంది. ఇక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల మధ్య కాలంలో ప్రజలకు కనపడటం లేదు. ప్రజలకు దూరమైతే వారి మద్దతు ఎలా లభిస్తుంది. ఎన్నికలనే రణ క్షేత్రంలో ఎదుటి బలం ఏమిటో తెలుసు కోవటమే కాదు. స్వపక్షంలో బలహీనతలు, లోపాలు తెలుసుకొని వాటిని సకాలంలో సరిదిద్దుకోవాలి. వారిలో అంతర్గత విభజన ఈ సమస్యను మరింత పెంచుతుంది.  సీనియర్ నాయకులపై పార్టీ అధికంగా ఆధార పడటం, ప్రాంతీయ లేదా యువ నాయకులకు అధికారాన్ని అప్పగించడంలో వెనుకబడటంతో కార్యకర్తలు విసుగెత్తుతున్నారు. మరోవైపు, బీజేపీ నిరంతరం రాష్ట్ర స్థాయి నాయకులకు అవకాశాలు ఇచ్చి, ప్రాంతీయంగా విజయాలను సాధిస్తోంది.

ఆలోచనల్లో  అయోమయం

జాతీయత, హిందుత్వం, అభివృద్ధి ఆశయాలపై బీజేపీ తన సిద్ధాంతాలను స్పష్టంగా నమ్ముతుంది. ప్రజలకు స్పష్టం గా వివరిస్తుంది. కాంగ్రెస్‌కు అలాంటి సిద్ధాంత పరమైన స్పష్టత లేదు. రాహుల్ గాంధీ కుల గణన, కార్పొరేట్ల ఆధిపత్యం (అదానీ వివాదం వంటి) వంటి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించినప్పటికీ, వాటికి ఒక స్పష్టమైన ఆలోచనా రూపాన్ని తేవడంలో విఫలమవుతుంది. ఇండియా కూటమిలో కూడా భావ సమైక్యత, ప్రజా సమస్యలపై ఏకతా భావం  కనిపించటం లేదు. అందరూ పెత్తనం కోసం పాకులాడే వారే. క్షేత్రస్థాయిలో కష్టించి పనిచేసే,నమ్మకమైన కార్యకర్తలు లేరు. బీజేపీ/ఆరెస్సెస్ లో  ప్రతి కార్యకర్త ఓ వీర సైనికుడే. ఫలితం ఎలా వస్తుందో లెక్కలేదు. ముందు తన కర్తవ్యాన్ని శక్తికొద్ది నెరవేర్చటమే లక్ష్యం. 

కాంగ్రెస్... బీజేపీకి వ్యతిరేకమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడలేకపోతోందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అభివృద్ధి విషయంలో రెండు పార్టీల విధానా లు ఒక్కటిగానే ప్రజలకు కనపడుతున్నా యి. పంజాబ్ , హర్యానా వంటి రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినా కాంగ్రెస్  గుణపాఠాలు నేర్చుకోలేదు. కాంగ్రెస్ తన ప్రత్యేకమైన పాలనా మార్గాన్ని, లక్ష్యాలను ప్రజలముందు ఉంచలేకపోతోందని అంటున్నారు.

ఎన్నికల సిద్ధతలో లోపాలు

ఎన్నికల విషయంలో బీజేపీ చూపే సంసిద్ధత అసమానం. ఒక ఎన్నిక ముగిసే నాటికి, వారి తదుపరి ఎన్నికల ప్రణాళికలు సిద్ధంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు ‘హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్’లో చెప్పినట్లుగా, బీజేపీ విజయానికి దారితీసింది దాని దీర్ఘకాలిక ప్రణా ళికలు, నిరంతర ఆచరణే.

కాంగ్రెస్, కేవలం సమస్యకు తగిన ప్రతిస్పందనగా మాత్రమే రియాక్ట్ అవుతుంది. ప్రతి ఓటమి తర్వాత కమిటీలు ఏర్పాటు చేయడమే కాని వాటి సిఫార్సులను అమలు చేయడంలో విఫలమవుతోంది. అంతేకాకుండా, కాంగ్రెస్ పూర్తిగా బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుపైనే ఆధారపడుతోంది. ఒక నిర్దిష్ట ఓటు బ్యాంకును నిర్మించుకోవడంలో దాని వైఫల్యం బీజేపీకి అనుకూలంగా మారుతోంది.

నాయకత్వ సవాళ్లు

రాహుల్ గాంధీ చేసే ప్రయత్నాలు గతంలో కంటే మెరుగు పడ్డాయి. ‘భారత్ జోడో యాత్ర’ వంటి కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయి. కానీ అవి ఎన్నికల విజయాల్లో మార్పు తీసుకురావడంలో విఫలమవుతున్నాయి. ఆయన నాయకత్వాన్ని కూటమి సభ్యులు అంగీకరించటం లేదు. ముఖ్యమైన సమయంలో రాహుల్ గాంధీలో నాయకత్వ పటిమ లోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ  గాంధీ కుటుంబంపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఎంత కాలం తాతల, తండ్రుల బలంపై పార్టీ కొనసాగుతుంది? ఇది పార్టీలో కొత్త శక్తిని తెచ్చే యువ నాయకుల ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తోంది. బలహీన నాయకత్వం పార్టీ సంస్కరణలను మరింత వెనక్కు నెట్టేస్తోంది.

బీజేపీ విజయ రహస్యం

బీజేపీ విజయానికి కారణం కేవలం సిద్ధాంతాలే కాకుండా, దాని ప్రణాళిక, సంస్థాగత శక్తి కూడా. బలమైన ప్రణాళికాబద్ధమైన సోషల్ మీడియా ప్రచారాలు, సంఘ్ పరివార్ వంటి అనుబంధ సంస్థలతో బీజేపీ ప్రజాభిప్రాయాన్ని ప్రభావి తం చేస్తోంది. వికసిత భారత్, స్వచ్ఛ భారత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఆశయాలను సమర్థవంతంగా ప్రజలకు చేరుస్తున్నాయి. ఆర్థికంగా బీజేపీకి ఉన్న బలం కూడా దాని విజయానికి కీలకం. ఈ ఆర్థిక సహకారం దానికి భారీ ప్రచారాలు నడిపించేందుకు,సంస్థాగత యంత్రాంగాన్ని సజీవంగా ఉంచేందుకు సహాయపడుతోంది. కాంగ్రెస్‌కు ఫండ్స్ పరిమితంగా ఉన్నాయి. పార్టీ ఫండ్స్‌ను బీజేపీ ఫ్రీజ్ చేసింది.

ప్రాంతీయ పార్టీల నుంచి పాఠాలు

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మరియు తెలుగు దేశం పార్టీ (టీడీపీ) వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సమర్థవంతంగా ఎదుర్కొని నిలుస్తున్నాయి. ఉదాహరణకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, రాష్ట్ర గర్వాన్ని, సంక్షేమ పథకాలను నమ్మించి బీజేపీని వెనక్కు నెట్టింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విద్య, ఆరోగ్యం, అవినీతి వ్యతిరేకత వంటి అంశాలతో ప్రజలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ కూడా ఈ ప్రాంతీయ పార్టీల మాదిరిగా స్థానిక పరిస్థితులను అనుసరిస్తూ సవాళ్లను ఎదుర్కోవాలి. వాటికి బలమైన చోట ఎక్కువ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ తన పెద్దరికం నిలుపుకోవాలి. సరైన ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా పట్టు విడుపులు ఉండాలి. కొన్ని సార్లు పరిస్థితులకు తగినట్లు రాజీ ధోరణి అవసరం. అనువు గాని చోట అధికులం ఎంటే ఎట్లా?

భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి?

కాంగ్రెస్ తిరిగి జాతీయ స్థాయిలో ప్రాబల్యం పొందాలంటే, ప్రధాన సంస్కరణలు అవసరం. బూత్ స్థాయి వరకు పార్టీని పునర్నిర్మించి ప్రజలతో అనుసంధానం పెంచాలి.స్థానిక నాయకులకు అధికారం ఇస్తూ, ప్రాంతీయ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. సమాజ సమానత్వం, పర్యావరణ రక్షణ,  సామాజిక ,ఆర్థిక న్యాయం వంటి సమకాలీన సమస్యలను నైపుణంతో  పరిష్కరించే విధానాన్ని రూపొందించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.ప్రాంతీయ పార్టీ లతో బలమైన కూటములను ఏర్పాటు చేయడం అత్యవసరం.

కాంగ్రెస్‌కు ఎదురయ్యే సవాళ్లు గొప్పవైనా, అవి అసాధ్యమేమీ కాదు. బీజేపీ విజయం సిద్ధాంత స్పష్టత, ప్రణాళికాబద్ధత, నిరంతర కృషిలో నిక్షిప్తంగా ఉంది. ఈ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే, కాంగ్రె స్ ఒక ఆధునిక రాజకీయ శక్తిగాదగాలి. లేకపోతే, దాని భవిష్యత్తు మరింత ప్రతికూలంగా మారుతుంది. ఇప్పుడు ఆత్మ పరిశీ లన చేసుకోవటం,అంత కంటే ముఖ్యంగా నిజాయితీగా సరైన చర్యలు తీసుకోవటం అవసరం. 

వ్యాసకర్త సెల్: 9849328496