ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, మే 11 (విజయక్రాంతి): హామీల అమలుపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ ఫరిధిలోని బీడీ వర్కర్స్ కాలనీ, బాన్సువాడ రూరల్ మండలంలోని తాడ్కోల్, దేశాయిపేట్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.
పదేళ్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క ఇల్లు కట్టించని ఏనుగు రవీందర్ రెడ్డి.. బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 ఇళ్లు కట్టించిన తనను విమర్శించడం తగదన్నారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని, బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అబద్ధాల పార్టీ
కాంగ్రెస్ అబద్ధాల పార్టీ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హామీలను అమలు చేయకుండా తక్కువ కాలం లోనే ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవాచేశారు. బీజేపీకి ఎలాంటి ఎజెండా లేదని.. రామాలయం, రాముడు అని ప్రచారం చేస్తున్నారని, వీటితో ప్రజలకు కడుపు నిండదని చెప్పారు. బీజేపీ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు భాస్కర్ రెడ్డి, మోహన్ నాయక్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.