calender_icon.png 20 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మొసలికన్నీరు

12-04-2025 01:09:45 AM

ముస్లింల ప్రాపకం కోసమే కులగణన

బీసీల హక్కులను కాలరాసేందుకు కుట్ర

బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లపై మొసలికన్నీరు కారుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, ఓబీసీ రిజర్వేషన్ల అంశం పేరుతో కులగణన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారని.. ఇంటిపోరు, హైకమాండ్ ఒత్తిడి తట్టుకోలేక, విధిలేని పరిస్థితుల్లో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టారని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారని.. తీరా కులగణన లెక్కలు చూసిన తర్వాత ముస్లింల ప్రాపకం కోసమే కులగణన చేపట్టినట్టు కనిపిస్తోందన్నారు. ఇది బీసీల హక్కులను కాలరాసే కుట్ర అని తెలిపారు. గతంలో బీసీల వాటాను 51 శాతం నుంచి 46 శాతానికి తగ్గించిన కాంగ్రెస్, ఇప్పుడు ముస్లింలను ఓబీసీల్లో చేర్చే ప్రయత్నం చేస్తోందన్నారు.

12 శాతం ఉన్న ముస్లిం జనాభాలో 10 శాతం ఓబీసీల్లో చేర్చి, ఓబీసీల హక్కులను కాలరాస్తు న్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేకుండా, 9వ షెడ్యూల్ వెనుక దాక్కొనే ప్రయత్నం చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్టికల్ 243 ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ 9వ షెడ్యూల్‌ను తీసుకొచ్చి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశు ద్ధి ఉన్నా, దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదించిన వెంటనే జీవో అమలు చేయొచ్చని.. కానీ 9వ షెడ్యూల్‌లో పొందుపరిస్తే గానీ రిజర్వేషన్ల అమలు చేయరాదనే భావనను తెలంగాణ సర్కార్ ప్రజల్లో కల్పిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రకారం రాష్ట్రాలు 50 శాతం గరిష్ఠ పరిమితిని పాటించాలని నిబంధన ఉందన్నారు.

రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలిసీ కూడా కోర్టు వివాదంలోని అంశాన్ని సాకుగా తీసుకొని 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయనే వాదనతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని.. కేంద్రంపై నెపం నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు పాల్గొన్నారు.