calender_icon.png 21 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు

01-09-2024 12:58:48 AM

  1. హైడ్రా పేరిట హామీల అమలు పక్కదారి 
  2. బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అవినీతిలో కూరుకుపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్నికల తర్వాత దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. ఫేక్ వీడియోలు, ప్రచారాలు, అబద్దాలు, హామీలతో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి అక్కడ సంపద దోచుకుంటున్నారని విమర్శించారు.

కర్నాటకలో ముడా పేరుతో  సీఎం సిద్ధరామయ్య, సిద్దార్థ విహార్ ట్రస్ట్ పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుటుంబ సభ్యులు కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు. పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రజలను నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటివరకు అక్కడ ఓపీఎస్, సీపీఎస్ అమలు కాలేదన్నారు. రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలకు ఏటీఎంగా మారి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారని అన్నారు. 

పక్కదారి పట్టించేందుకే..

 హామీలపై ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా, ఫోర్త్ సిటీ, హెల్త్ సిటీ, కల్చరల్ సిటీ అని పూటకొకమాట మాట్లాడుతున్నారన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం హైడ్రానే అనే రీతిలో వ్యవహరిస్తోందన్నారు. నగరంలో చెరువులను పరిరక్షించాల్సిందేనని, అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందేనన్నారు. అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలన్నారు.

రాష్ర్టంలో కబ్జాకు గురైన అసైన్డ్, ఎండోమెంట్, శిఖం భూముల మీద రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న అక్రమ కట్టడాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలన్నారు. సర్కారు వైద్యం సక్రమంగా లేక ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.   ఎమ్మెల్సీ కవితకు బెయిల్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే న్యాయస్థానాలను రాజకీయాలలోకి లాగడం కాంగ్రెస్‌కే చెల్లుతుందని మండిపడ్డారు.