- అన్నదాతలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు
- ఏడాదిలో మరణించిన 402 మంది రైతుల బాధ్యత ప్రభుత్వానిదే
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లడుతాం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): రుణభారంతో ఆదిలాబాద్‌లో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఇందుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనమన్నారు.
రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ఏడాది పాలనలో ఇప్పటివరకు 402 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండటం దుర్మార్గమన్నారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాడని విమర్శించారు. గతంలో రుణమాఫీ కాలేదంటూ అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టు చేశారన్నారు. పోలీస్ యాక్ట్ పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసి ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కారని ఆరోపించారు. రుణమాఫీ జరగకపోవడంతో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారని..ఉన్న భూములు కుదవ పెట్టి అప్పులు తెచ్చుకుని వాటిని చెల్లించలేక చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు.
రుణమాఫీ అని మభ్య పెట్టి.. రూ.500 బోనస్ అని మోసం చేసి పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ దురవస్థ ఏర్పడిందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. బీఆర్‌ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చేదాక నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీఆర్‌ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.