ఆరు గ్యారెంటీల అమలులోనూ విఫలం
ఆ పార్టీ వస్తూనే కరువును మోసుకొచ్చింది
దేవుడి ఫొటోలు పంపి బీజేపీ ఓట్లడుగుతోంది
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట/హుస్నాబాద్/పటాన్‌చెరు, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్‌లో సాగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్‌కు వికాసం కావాలంటే వినోద్‌ను గెలిపించాలని, విధ్వంసం కావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గెలిపించాలన్నారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కులం, మతం, దేవుళ్ల పేరుతో బీజేపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు కాబట్టే దేవుళ్ల ఫొటోలు పంపించి బండి సంజయ్ ఓట్లు అడుగుతున్నారని, ఫొటోలు కడుపు నింపవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ బొమ్మ, బొరుసు వంటివని విమర్శించారు.
కాంగ్రస్‌తో పాటే కరువు
అనంతరం తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలో ఎంఐజీ, విద్యుత్‌నగర్ కాలనీల్లో రోడ్ షోలో పాల్గొన్నారు హరీశ్‌రావు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పాటు కరువు, కష్టాలు కూడా వచ్చాయని, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో కరువు అనేది లేదని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిస సంక్షేమ పథకాలను ఈ సర్కారు పక్కన పెట్టిందన్నారు. జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, పరిపాలన అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరికలు..
బసవేశ్వర జయంతి సందర్భంగా శుక్రవారం సిద్దిపేటలోని రాజీవ్ రహదారిలో గల ఆయన విగ్రహానికి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిద్దిపేట గణేశ్‌నగర్ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన హనుమాన్ స్వాముల దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు పార్టీల కార్యాకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.