calender_icon.png 15 November, 2024 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ పాలన

09-09-2024 01:54:43 AM

మాజీ మంత్రి హరీశ్ రావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతుల పట్ల కాంగ్రెస్ పాలన యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే మేడ్చల్‌లో రైతు సురేందర్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నించారు. ఆయన తల్లికి లక్షా 15 వేలు , సురేందర్ రెడ్డికి లక్షా 92 వేలు అప్పు ఉందని, కుటుంబసభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని బ్యాంకు మేనేజర్ అని రుధ్ చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సురేందర్‌రెడ్డి ఆత్మహత్య లేఖలో ప్రతి అక్షరం రేవంత్‌రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. రేవంత్ మాట పొద్దుతిరుగుడు కంటే వేగంగా మారుతోందని ఎద్దేవాచేశారు. మాఫీకి రేషన్‌కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పారని, సురేందర్ ఆత్మహత్య రేష న్‌కార్డుకు రుణమాఫీకి లింక్ ఉన్నదని నిరూపించిదన్నారు.

రేవంత్ పాలనకు సురేందర్ రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిదన్నారు. రుణమాఫీ ఆంక్షలతో కుటుంబబంధాల్లో చిచ్చుపెట్టిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ సర్కార్ అని విమర్శించారు. సిద్దిపేటలోని జక్కాపూర్‌లో గురజాల బాల్‌రెడ్డి కుటుంబంలో ముగ్గురికి ౬లక్షల అప్పు ఉంటే కేవలం రెండు లక్షలే మాఫీ అయిందని పేర్కొన్నారు. నారాయణరావుపేటలో నల్ల మణెమ్మ అనే రైతుకు రూ.లక్ష అప్పు ఉందని, ఆమె భర్త 2010లో మరణిస్తే ఆయన ఆధార్‌కార్డు తెస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారని, 2010లో ఆధార్‌కార్డు ఇవ్వనప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారని ప్రశ్నించారు. సన్న వడ్లకే బోనస్ అని మోసం చేస్తున్నారన్నారు. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయనందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. 

పాల్వాయి తెలంగాణకు పూర్తి మద్దతు 

అధికార పార్టీలో ఉంటూ తెలంగాణ ఏర్పాటు కోసం బలమైన వాదన వినిపించిన నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో నిర్వహించిన గోవర్ధన్‌రెడ్డి దంపతుల స్మారక సమావేశానికి హాజరై మాట్లాడారు. వేర్వేరు పార్టీలో ఉన్నా తమను ఉద్యమమే అనేక సందర్భాల్లో కలిపిందన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు.  పాల్వాయి అంటే కేసీఆర్‌కు ఎంతో గౌరవమన్నారు. ఆయన చనిపోయినప్పుడు  అధికార లాంఛనాలతో  అంత్యక్రి యలు నిర్వహించారని తెలిపారు. వారి ఆశయాలను వారి కుటుంబ సభ్యులు కొనసా గించాలని కోరారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, కే.ఆర్.సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గోవర్ధన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. 

పోలీసులు ఎందుకు ప్రశ్నించరు..

పోలీసు అధికారులు ఎవరి ఒత్తిడికి తలొగ్గి మాట్లాడవద్దన్నారు. కేసీఆర్ పాలనలో పోలీ సులకు స్టేషనరీ ఖర్చుకు నెలకు డబ్బులు కేటాయించామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని దాని పై పోలీసు అధికారుల సంఘం ఎందుకు మాట్లాడదని హరీశ్‌రావు నిలదీశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులకు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ ఎందుకు కావడం లేదని, దానిపై సంఘం ఎందుకు ప్రశ్నించదని పేర్కొన్నారు. సమావే శంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.