calender_icon.png 9 October, 2024 | 3:37 PM

పోలీస్ రాజ్యంగా కాంగ్రెస్ పాలన..

09-10-2024 01:14:46 PM

నియోజకవర్గంకు వెళుతుంటే అడ్డుకుంటారా..

పోలీసుల హౌస్ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక (విజయక్రాంతి): మా నియోజకవర్గం దుబ్బాక కు వెళుతుంటే సమయానికి పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కొండాపూర్ లోని నివాసం నుండి దుబ్బాక నియోజకవర్గంకు బయలు దేరుతున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని లోకల్ పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నామని తెలుపడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నియోజకవర్గంకు వెళుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరు చెప్పినా ఆగేది లేదని ముందుకెళ్లారు.  ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఈ విషయమై డి సి పీ జయరాం తో ఎమ్మెల్యే మాట్లాడారు.

నియోజకవర్గం వెళుతుంటే అడ్డుకుంటున్నారని, కనీసం మాదాపూర్ లోని మా కార్యాలయంకు నైనా వెళ్ళనీయాలని కోరారు. డీసీపీ ఆదేశాల మేరకు పోలీసులు మాదాపూర్ కార్యాలయంకు తీసుకెళ్లి అక్కడ ఆఫీస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో పోలీస్ పాలన సాగుతుందని విమర్శించారు. ఎమ్మెల్యేలను విధులు అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. కెసిఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తివేస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు నిర్భంధాలపై సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామన్నారు.