- మోసపూరిత హామీలను ప్రజలకు వివరించి గద్దె దించుదాం
- ఏడాదిగా గులాబీ సైనికులు చేస్తున్న పోరాటం అద్భుతం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపై, మోసపూరిత హామీల ప్రభుత్వ తీరుపై పోరాటం కొనసాగిద్దామని బీఆర్‌ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పిలుపునిచ్చారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గత ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు.
ప్రాణసమానులైన మన బీఆర్‌ఎస్ తోబుట్టువుల్లారా అంటూ ప్రారంభించిన కేటీఆర్.. ఏడాదిగా చేసిన పోరాటాలను నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూ రానున్న రోజుల్లోనూ కాంగ్రెస్ మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాటం సాగిద్దామని చెప్పారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులు కనబరిచిన పోరాటస్ఫూర్తికి శిరస్సువంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.
గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కనబరిచిన కదనోత్సాహం, రాష్ర్ట స్థాయిలో పనిచేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందన్నారు. తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు రాష్ర్ట ప్రజలపక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారనీ, అబద్ధాల పునాదులపై అధికారంలోకి కాంగ్రెస్ పాలనతో కష్టకాలంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన అలుపులేని పోరాటం చేశారని అభినందించారు.
ఏడాది కాలంలో పార్టీ శ్రేణులు రైతులకు, నేతన్నలకున, మహిళా సమస్యలపై మీరు గర్జించారని, బలహీనవర్గాల ప్రజల గళమయ్యారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారని, నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారని పేర్కొన్నారు.
గులాబీ జంగ్ సైరన్‌తో రేవంత్‌కు చెమటలు
మూసీలో మూటల వేట నుంచి లగచర్ల లడాయి వరకూ అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ శ్రేణులు కొట్లాడారనీ, తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడు గునా ప్రతిధ్వనింపజేశారని కేటీఆర్ కొనియాడారు. రాష్ర్ట ప్రయోజనాలు కాపా డేందుకు బీఆర్‌ఎస్ చేసిన పోరాటాలు చరిత్రపై చెరగని సంతకాలుగా నిలుస్తాయన్నారు.
తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై బీఆర్‌ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ సీఎం రేవంత్‌కు ముచ్చెమటలు పట్టించిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అలుపెరగని పోరాటంతో అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వా ల్సి వచ్చిందన్నారు.
ఏడాదికాలంగా ప్ర భుత్వాన్ని నిలదీసే క్రమంలో నియంతృత్వ రాష్ర్ట ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు బనాయించినా ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యం తో పార్టీ శ్రేణులు నిలబడ్డ తీరు అపూ ర్వం, అసాధారణం, చరిత్రాత్మకమని ప్ర శంసించారు.
దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, కుక్కలు చింపి న విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను, అడుగడుగునా నిలదీద్దామని పిలుపునిచ్చారు. మన పార్టీకి పునాది రాళ్లు, మన బీఆర్‌ఎస్‌కు మూలస్తంభాలు పార్టీ శ్రేణులు అని, మన గులాబీ జెండాకు వెన్నుముక మీరే అన్నారు.
రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్‌ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలుగా మారుతారని ఆకాంక్షించారు. ఏడాది పాటు అద్భుతమైన పోరాట పటిమ చూపిన గులాబీ సైనికులందరికి గుండెలనిండా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.