గాంధీ భవన్ కాంగ్రెస్ నాయకుల ధర్నా
పార్టీకి నష్టం చేస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు
తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడికి వినతి
కామారెడ్డి, నవంబర్ 2౧ (విజయక్రాంతి): జుక్కల్, బాన్సువాడ ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల గాంధీ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. పార్టీకి నష్టం చేస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యకర్తలను విస్మరిస్తూ పార్టీ బలహీనపడటానికి కారణం అవుతున్నారని విమర్శించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పట్టించుకోవడం లేదని 8 మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారంపైనా ఫిర్యాదు చేశారు. 20 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నామినేటేడ్ పదవులు తన అనుకూలమైన వారికి కట్టబెడుతున్నారని లక్ష్మీకాంతారావుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రవర్తన మారకుంటే జుక్కల్‌లో కాంగ్రెస్‌కు రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ సాగర్, నాయకులు అరవింద్, కమల్, వినోద్, సంగమే శ్వర్, జయప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.