calender_icon.png 19 April, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కేసులు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసన

16-04-2025 09:02:11 PM

మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ, రాజకీయం పేరుతో చట్టాలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, మంద తిరుమల్ రెడ్డిలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, శామ్‌ పిట్రోడాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి) ఛార్జిషీట్‌ దాఖలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, అన్ని రాష్ట్రాల్లోని జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన  పిలుపు మేరకు  పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోల్ బెల్ట్ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వానికి, ఈడి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... కేంద్ర సంస్థల అధికారాలను బిజెపి దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి అవమానంగా, రాజకీయం పేరుతో చట్టాలను ముసుగు చేసుకుని, ప్రతిపక్ష నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత  రాహుల్‌ గాంధీ లపై ఏ 1, ఏ 2 లుగా చార్జ్‌ షీట్‌ దాఖలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయంగా ప్రేరేపితమైనదని స్పష్టమవుతుందని తెలిపారు. 

ఆ సంస్థ ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి అక్రమం జరగలేదని ఇప్పటికే పలు విచారణల్లో తేలిందని, అయినా ఆర్ధిక నేర నిరోధక సంస్థను (ఈడి) బిజెపి ప్రభుత్వం రాజకీయ రీత్యా దుర్వినియోగం చేస్తోందని అన్నారు. అధికార బిజెపి తన రాజకీయ ప్రత్యర్థులను అణచి వేయడానికి, విచారణ సంస్థలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిజెపి వాడుకుంటోందని, ఇది రాజ్యాంగ పరిపాలనకు విరుద్ధమన్నారు. అక్రమ కేసులు వెంటనే నిలిపివేయాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.