calender_icon.png 10 January, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరానికి కాంగ్రెస్ సన్నద్ధం

05-01-2025 12:12:04 AM

  1. జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
  2. 6, 7, 8 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల టూర్
  3. ఇప్పటికే నియోజకవర్గాల్లో ముఖ్యనాయకుల సమావేశాలు
  4. బీసీ రిజర్వేషన్ల పెంపుతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్క్‌పెట్టాలని ఆలోచన

హైదారబాద్, జనవరి 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ స్థానిక సమరానికి సన్నద్ధమవుతోంది. పంచాయతీలను హస్తగతం చేసుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. ఓ వైపు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమాయ త్తం చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో వరుసగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించన్నారు. ఆ మూడు రోజులపాటు ఆయా జిల్లాల పార్టీ నేతలతో సమావేశమై.. స్థానిక ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధంగా ఉండాలని సూచనలు చేయనున్నారు.

గతంలోనే వరంగల్, మెదక్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు జిల్లాలకే వెళ్లాలని నిర్ణయించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు వారివారి సొంత నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యనేతల తో సమవేశాలు నిర్వహిస్తున్నారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ, జూపల్లి, విప్‌లు బీర్ల అయిలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులను, క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు.

సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా..

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకా లం ముగిసిన విషయం తెలిసిందే. ముందుగా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికే కొన్నింటిని నెరవేర్చగా, మరికొన్నింటిని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు.

ప్రధానంగా రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థికసాయం, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లాంటి పథకాలతో పాటు భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ తదితర పథకాలను అమలు చేస్తోంది. వీటితో పాటు త్వరలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలనూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది.

బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్కార్ ఫోకస్!

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు అనుకూలంగా తీర్పునిస్తుంటారు. ఇప్పు డున్న రాజకీయ పరిస్థితుల్లో అధికారేతర పార్టీ నుంచి ఎవరైనా విజయం సాధిస్తే.. ఆ తర్వాత అధికార పార్టీ గూటికి రావడం పరిపాటిగా మారింది. గ్రామాల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ ఉంటుందని, బీజేపీ నామమాత్రంగానే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తు న్నారు.

ఇక పట్టణాల్లో మాత్రం బీజేపీతోనే పోటీ ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. అందుకు రెండు పార్టీలను ఇరుకున పెట్టేలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 32 శాతం వరకు అమలయ్యేవని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ సర్కార్ 22 శాతానికి పరిమితం చేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్రప్రభు త్వం డెడికేటెడ్ కమిషన్ వేయడం, కులగణన చేపట్టిందని, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడుతోపాటు మంత్రులు, కాంగ్రెస్ నేత లు ఘంటాపథంగా చెబుతున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరసన కార్యక్రమంపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఇక బీజేపీ కూడీ బీసీలకు వ్యతిరేకమని ప్రచారం చేయాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న డిమాండ్‌ను ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదన్న విషయాన్ని ప్రచారం చేయాలని భావిస్తున్నారు.