17-04-2025 02:41:09 PM
నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమే..
గోదావరిఖనిలో నిరసనలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్..
రామగుండం (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పికొట్టే సమయం వచ్చిందని గోదావరి ఖనిలో నిరసనలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జి షీటులో అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనలతో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన ప్రదర్శన పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్బంగా నాయకులు బొంతల రాజేష్, మాదరబోయిన రవికుమార్ మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థల వాడకంతో రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇదే క్రమంలో ముందుకెళ్లుతోందని, ఇది చట్టపరమైన కేసు కాదని, రాహుల్ గాంధీ వంటి నాయకుడిపై వ్యతిరేకత కారణంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన చిత్తశుద్ధిలేని చర్య అని, అసలు నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రజల చైతన్యానికి, స్వాతంత్ర్య పోరాటానికి ఉపయోగపడిన ఒక గొప్ప వేదిక అని, ఆ పత్రికను నిర్వహించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అనే సంస్థకు అప్పులు ఉండగా, వాటిని తీర్చేందుకు యువ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (YI) అనే సంస్థ ఏర్పాటైందని, ఇది పూర్తిగా చట్టబద్ధంగా జరిగిందని, కానీ కేంద్రం ఇప్పటికీ ఆధారాలు లేకుండానే దానిపై తప్పుడు ఆరోపణలు, బెదిరింపులు, మానసిక వత్తిడి తేవడానికి ఈడీని వాడుతోందని, ఈ చర్యల వెనుక అసలు ఉద్దేశం ప్రతిపక్షాన్ని బలహీనపరిచి, ప్రజల్లో భయాందోళన కలిగించడమే అని, రాజకీయంగా రాహుల్ గాంధీ వంటి ధైర్యవంతులను మట్టికరిపించడం కోసమే ఈ కేసులు నమోదు చేశారని, ఈ నిరసన ధర్నా ద్వారా మేము చెబుతున్న సందేశమని, ఇది కేవలం కాంగ్రెస్ పోరాటం కాదని... ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రతి పౌరుడి పోరాటమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.