హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో విజయోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలు జరుపుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకోని ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన, 28 పారా మెడికాల్, 16 నర్సింగ్ కళాశాలలను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలతో ఒప్పందాలు, గ్రూప్-4కు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్ లో భారీగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.