calender_icon.png 16 November, 2024 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీది గ్యారెంటీ మోసం

19-09-2024 02:01:11 AM

బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గ్యారెంటీల పేరుతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పీఎం మోదీ పాలన అందిస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రజలను అక్కడి ప్రభుత్వాలు మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్నాయంటూ విమర్శించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుందని, పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యం గా పథకాలు అమలు చేస్తోందని అన్నారు.

విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, భద్రత, ఇంధనం, సాంకేతికత వంటి అనేక రంగాలలో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందన్నారు. మోదీ సుపరిపాలనకు ప్రజలు పట్టం కడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబం జీర్ణించుకోలేక, అబద్ధపు ప్రచారంతో దాడి చేస్తున్నారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా, విదేశాలకు వెళ్లి అక్కడ మన దేశంపై విషం చిమ్ముతున్నారంటూ రాహుల్ గాంధీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వా మ్యం లేదని, మోదీపై నిందలు వేయడం రాహుల్‌కు పరిపాటిగా మారిందని అన్నారు. సమావే శంలో రాష్ర్ట ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.