రుణమాఫీపై ఒక్కోరోజు ఒక్కో లెక్క
కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోందని.. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మొత్తం చేసినట్టు అబద్ధాలాడుతున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, 224 రోజుల తర్వాత సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.31 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని ఓ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెల 6న ప్రధాని మోదీకి రాసిన లేఖలో మాత్రం రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారని గుర్తుచేశారు.
మిగిలిన రూ.14 వేల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మరో 16 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదని అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ కోసం రైతులు ఇంకెంత కాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ మోసాల జాబితాలో మరో మోసంగా కిషన్‌రెడ్డి అభివర్ణించారు.
మొదట్లో అందరు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని ఇప్పుడు మాటమార్చి ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమేనని చెప్పడం దారుణమైన మోసమని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ అన్న దశ నుంచి కొందరికి మాత్రమే అనే వరకు పరిస్థితిని మార్చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.