- అధిష్ఠానం పిలుపుతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనం
- పలువురు అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం
కరీంనగర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో నిలిచేందుకు నెల రోజుల ముందు నుంచే అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఆయనకు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపురావడంతో శనివారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఆదివారం ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అధికార కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపేందుకు నరేందర్‌రెడ్డిని సరైన వ్యక్తిగా భావించి ఢిల్లీ పెద్దలు పిలిచినట్లు తెలుస్తున్నది. నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల అభ్యర్థిగా ఆయన సీటు ఆశిస్తున్నారు.
విద్యావేత్తగా, సామాజికవేత్తగా, ప్రజాబలం కలిగిన నేతగా నరేందర్‌రెడ్డి ఈ ప్రాంతంలో మంచి పేరున్నది. ఈ కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ ఆయనపై నజర్ వేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నరేందర్‌రెడ్డికి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల నుంచి కూడా మద్దతు పెరుగుతండడంతో పాటు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంలో నరేందర్‌రెడ్డి కృషి చేశారు.
ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ఉండడం, తన విద్యార్థుల్లో పట్టభద్రులైన వారు సుమారు 40 వేలకుపైగా ఉండి, వారు ఓటర్లు నమోదు చేసుకునేందుకు సిద్ధంగా ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అందరికంటే ముందుగా నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ ప్రచార కార్యాలయాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో ప్రారంభించారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినాఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం ఆయనకు పట్టభద్రుల్లో బలాన్ని పెంచాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.