calender_icon.png 12 January, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటే కమిట్‌మెంట్

08-12-2024 01:31:37 AM

  1. ఇచ్చిన మాట తప్పకుండా అమలుచేస్తాం
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  3. టెక్స్‌టైల్ పార్కు నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ 

వరంగల్(జనగామ), డిసెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటే కమిట్ మెంట్ అని, ఇచ్చిన మాట తప్పకుండా అమలుచేసి తీరుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

అనంతరం పీహెచ్‌సీ భవనం, వెటర్నరీ ఆస్పత్రి నిర్మాణం, మైక్రో మినీ స్మాల్ ఇండస్ట్రీస్‌లో రోడ్లు, మంచినీటి సరఫరా వంటి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అనేక పనులు నత్తనడకన సాగాయని, ఏండ్లకేండ్లుగా పెండింగ్‌లో ఎన్నో పనులను తాము ఏడాదిలో పూర్తిచేశామని చెప్పారు.

టెక్స్‌టైల్ పార్కులో డ్రైనేజీ సమస్య ఉండేదని, గతంలో వరదలు కూడా వచ్చాయని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు నిర్వాసితులకు న్యాయం చేసేందుకు పూనుకున్నామన్నారు.

స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి  చొరవతో తక్కువ సమయంలోనే ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 50 గజాల స్థలం ఉన్న నిర్వాసితులకు 25 గజాలు అదనంగా కేటాయించినట్లు తెలిపారు. ఏడాదిలోనే ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కిస్తే.. ప్రతిపక్షాలు ఓర్వలేక విషం చిమ్ముతున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.