25-03-2025 11:27:58 AM
మునిపల్లి: మండల పరిధిలోని ఖమ్మంపల్లి, బుదేరా, కలపల్లి బేలూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం నాడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ ఆధ్వర్యంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బూటకం హామీలుగా మిగులుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో టిఆర్ఎస్ హయాంలో ప్రజలు, రైతులుకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇస్తాం అంటూ ప్రజలకు మాట ఇచ్చారు కానీ.. ఆర్ గ్యారంటీలు కాదు కదా గ్యారెంటీ లేని పథకాలుగా మారాయన్నారు.
అందోల్ నియోజకవర్గానికి మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర అన్యాయం చేశారని బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని అన్నారు. రైతుల పంటల సాగు కోసం సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని గతంలో ప్రారంభిస్తే ఇప్పుడు దాని ఊసు ఎత్తడం లేదన్నారు. అలాగే లింగంపల్లి గ్రామ శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 500 ఎకరాల భూములను సేకరించి రైతులకు చెక్కులు కూడా అందించామని.. ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఊసే ఎత్తడం లేదు అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశి కుమార్, నాయకులు భాస్కర్ , కుతుబోద్దిన్ , శివశంకర్, మౌలానా, సుల్తాన్, దుర్గయ్య, సుభాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.