calender_icon.png 25 October, 2024 | 12:04 PM

కాంగ్రెస్ నాయకులకు ఓట్లడిగే హక్కు లేదు

05-05-2024 12:59:24 AM

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే  గంప గోవర్ధన్ ఫైర్

కామారెడ్డి, మే 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు లేదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి జిల్లాను సాధించుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి కొత్త జిల్లాలను రద్దు చేసి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ఇప్పుడు జిల్లాలను, మండలాలను రద్దు చేసి.. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతారా అని అన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇంతవరకు ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు. అనంతరం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడు తూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, ఎంపీపీలు దశరథ్ రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, నాయకులు ప్రభాకర్ రెడ్డి, గైని శ్రీనివాస్ గౌడ్,  ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.