26-03-2025 10:42:59 PM
గజ్వేల్ ఏఎంసి మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..
గజ్వేల్: గత కాంగ్రెస్ పాలనలో మొదలుకొని ఈ 15 నెలల కాలంలో గజ్వెల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, కేసిఆర్ పదేళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సవాల్ విసిరారు. బుధవారం గజ్వేల్ లో విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో గజ్వేల్ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు.
కేసిఆర్ పదేళ్ళ పాలనలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన బతుకుదెరువు మార్గాల్ని కూడా కేసిఆర్ కల్పించారన్నారు. గజ్వేల్ నేడు అన్నపూర్ణగా మారిందంటే దానికి కారణం కేసిఆర్ దూర దృష్టి మాత్రమే అని అన్నారు. కేసిఆర్ పాలనలో మొదటి 5 సంవత్సరాల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా సాక్షే అని గతంలో అనేక సందర్భాల్లో కేసిఆర్ చేసిన అభివృద్ధిని పొగిడిన సందర్భాలను మర్చిపోయారన్నారు. పెండింగ్ పనులను పదిహేను నెలల కాలంలో ప్రారంభించేందుకు ఎందుకు కృషి చేయడం లేదో చెప్పాలన్నారు.
బస్టాండ్, డబుల్ బెడ్రూం, నిర్వాసితుల సమస్యల మీద పదే పదే మాట్లాడే కాంగ్రెస్ నాయకులు సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నం ఏముందని ప్రశ్నించారు. పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు పనులు మంజూరు చేయించినా బాగుండేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కేసిఆర్, హరీష్ రావు మీద పొద్దుపోవడం మాని ప్రజల కోసం పని చేస్తే బాగుంటుందని లేనిపక్షంలో ప్రజా క్షేత్రంలో మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కొమురయ్య, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, నాయకులు భాస్కర్, రామస్వామి యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.